Team India: సఫారీ గడ్డపై ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ?

ప్రపంచ క్రికెట్ లో టెస్ట్ ఫార్మేట్ కు సంబంధించి భారత్ కు అందని సిరీస్ విజయం ఏదైనా ఉందంటే అది సౌతాఫ్రికాలోనే. ఇప్పటి వరకూ ఏడుసార్లు అక్కడ పర్యటించినా ఒక్కసారి కూడా భారత్ టెస్ట్ సిరీస్ గెలవలేకపోయింది.

  • Written By:
  • Updated On - January 10, 2022 / 09:23 PM IST

ప్రపంచ క్రికెట్ లో టెస్ట్ ఫార్మేట్ కు సంబంధించి భారత్ కు అందని సిరీస్ విజయం ఏదైనా ఉందంటే అది సౌతాఫ్రికాలోనే. ఇప్పటి వరకూ ఏడుసార్లు అక్కడ పర్యటించినా ఒక్కసారి కూడా భారత్ టెస్ట్ సిరీస్ గెలవలేకపోయింది. 2010లో సిరీస్ సమం చేయడమే అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. గత పర్యటనలో 2-1 తేడాతో సిరీస్ కోల్పోయినా.. మంచి ప్రదర్శనే కనబరిచింది. ఈ సారి భారీ అంచనాల మధ్య సఫారీ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా దానికి తగ్గట్టుగానే తొలి టెస్టులో అదరగొట్టింది. సఫారీలను నిలువరించి సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. అయితే రెండో మ్యాచ్ లో మాత్రం దక్షిణాఫ్రికా పుంజుకోవడంతో ఓటమి తప్పలేదు. ప్రస్తుతం మూడు టెస్టుల సిరీస్ లో ఇరు జట్లూ 1-1తో సమంగా ఉన్నాయి. మంగళవారం నుండి కేప్ టౌన్ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్ట్ సిరీస్ ఫలితాన్ని తేల్చబోతోంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే చరిత్ర సృష్టించినట్టే. బ్యాటింగ్ లో కొన్ని ఇబ్బందులు అధిగమిస్తే భారత కల నెరవేరినట్టేనని చెప్పొచ్చు.

గాయంతో రెండో టెస్టుకు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో టెస్టులో రీఎంట్రీ ఇవ్వబోతుండడం కలిసొచ్చే అంశం. కోహ్లీ అగ్రెసివ్ కెప్టెన్సీ లేకపోవడంతోనే రెండో టెస్టులో భారత్ ఓటమి పాలైందన్న అభిప్రాయం ఉంది. దీంతో చారిత్రక సిరీస్ విజయానికి అడుగుదూరంలో ఉన్న టీమిండియాకు కోహ్లీ రాక ఖచ్చితంగా లాభం చేకూర్చేదే. అటు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, రాహుల్ ఫామ్ లో ఉండడం కూడా అడ్వాంటేజ్ . వీరిద్దరూ భారీస్కోర్లు సాధించాలని మేనేజ్ మెంట్ కోరుకుంటోంది. ఇక మిడిలార్డర్ లో రహానే, పుజారా ఫామ్ లోకి రావడం భారత్ కు గొప్ప ఊరటనిచ్చింది. కేప్ టౌన్ లో కూడా ఈ జోడీ రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక వికెట్ కీపర్ రిషప్ పంత్ బ్యాటింగ్ వైఫల్యం ఆందోళన కలిగిస్తుండగా.. ఈ మ్యాచ్ తో అతను గాడిన పడాలని ఆశిస్తోంది. ఒకవేళ కోహ్లీ పంత్ ను డ్రాప్ చేసి సాహాకు చోటు కల్పించే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని విశ్లేషకుల అంచనా.

ఇక బౌలింగ్ లో మన పేసర్లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. గత మ్యాచ్ లో అంతగా ప్రభావం చూపకపోయినప్పటకీ ఓవరాల్ గా మన బౌలర్ల ప్రదర్శన అంచనాలకు తగ్గట్టే సాగుతోంది. అయితే మహ్మద్ సిరాజ్ ఫిట్ నెస్ సాధించకుంటే ఇశాంత్ , ఉమేశ్ లలో ఒకరికి చోటు దక్కనుంది. వీరిద్దరూ అనుభవం ఉన్న బౌలర్లే కావడంతో మన బౌలింగ్ మరింత బలపడినట్టే. ఇదిలా ఉంటే కేప్ టౌన్ లో గత రికార్డులు మాత్రం భారత్ కు అనుకూలంగా లేవు. ఇక్కడ ఒక్కసారి కూడా మ్యాచ్ గెలవని టీమిండియా ఈ సారి ఆ రికార్డును బ్రేక్ చేస్తే చారిత్రక సిరీస్ విజయం మనకు అందినట్టేనని చెప్పొచ్చు.