Karun Nair: కర్ణాటక క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న మహారాజా టీ20 లీగ్‌లో కరుణ్ నాయర్ భారీ సెంచరీతో ఊచకోత కోశాడు. చాలా కాలం తర్వాత కరుణ్ తనదైన బ్యాటింగ్ శైలిలో తుఫాను ఇన్నింగ్స్ కు తెరలేపాడు. మైసూర్, మంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో, కరుణ్ తన జట్టును విజయపథంలో నడిపించాడు. దీంతో మనోడి భారత జట్టు ఎంట్రీకి తలుపులు తెరుచుకోనున్నాయి అని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మైసూర్ తరఫున కరుణ్ నాయర్ కేవలం 48 బంతుల్లో 13 ఫోర్లు, 9 అద్భుతమైన సిక్సర్ల సాయంతో 124 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ఆధారంగా మొదట బ్యాటింగ్ చేసిన మైసూర్ 4 వికెట్లకు 226 పరుగులు చేసింది. మంగుళూరు 14 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులకె ఇన్నింగ్స్ ముగించింది. ఫలితంగా మైసూర్ 27 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. గత మ్యాచ్‌లో కరుణ్ నాయర్ 35 బంతుల్లో 66 పరుగుల ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. కరుణ్ నాయర్ దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ జాతీయ జట్టులో ఆడే అవకాశం రాలేదు. గత ఐపీఎల్ వేలంలో నాయర్ అమ్ముడుపోలేదు. కానీ మహారాజా ట్రోఫీలో అతని బ్యాటింగ్ విధానం చూస్తుంటే వచ్చే ఐపీఎల్ కరుణ్ కు కాంట్రాక్ట్ దక్కుతుందని భావించవచ్చు.
2017 సమయంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన నాయర్ ఐపీఎల్‌లో 76 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 10 హాఫ్ సెంచరీలతో 1496 పరుగులు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన భారత క్రికెట్‌లో కరుణ్ రెండవ బ్యాట్స్‌మెన్, అయినప్పటికీ అతను 7 సంవత్సరాలుగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. 32 ఏళ్ల నాయర్ తన అరంగేట్రం సిరీస్‌లో ట్రిపుల్ సెంచరీ చేసినప్పటికీ, అతనికి 6 టెస్టులు మాత్రమే ఆడే అవకాశం లభించింది. అతను కేవలం 2 వన్డేలు మాత్రమే ఆడాడు. మరి కరుణ్ వయసు దృష్ట్యా బీసీసీఐ జాతీయ జట్టుకు ఎంపిక చేస్తుందో లేదో చూడాలి. కనీసం వచ్చే ఐపీఎల్ లో అయినా ఏదైనా ఫ్రాంచైజీ మనోడి ప్రతిభను గుర్తించి అవకాశం కల్పించాలని కోరుకుందాం.
Also Read: Amaravati: ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధి బృందంతో చంద్రబాబు సమావేశం