Site icon HashtagU Telugu

BWF World Championships:చిరాగ్‌-సాత్విక్ జోడీకి కాంస్యం

Badminton

Badminton

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత డబుల్స్ జోడి చిరాగ్ షెట్టి-సాత్విక్ సాయిరాజ్‌ కాంస్యంతో సరిపెట్టుకున్నారు. సెమీఫైనల్లో ఈ జోడీ మలేషియాకు చెందిన ఆరోన్ చియా-సో వూయ్ చేతిలో పరాజయం పాలైంది. అయితే పురుషుల డబుల్స్‌లో మెడల్ గెలిచిన తొలి భారత జోడీగా రికార్డ్ సృష్టించింది.
హోరాహారీగా సాగిన మ్యాచ్‌లో భారత జోడీ 22-20, 18-21, 16-21 తేడాతో ఓటమి పాలైంది. 76 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌ రసవత్తరంగా సాగింది. తొలి గేమ్ నుంచి నువ్వా నేనా అన్నట్టు భారత్, మలేషియన్ జోడీలు తలపడ్డాయి. తొలి గేమ్‌ను అదనపు పాయింట్లతో గెలిచిన సాత్విక్-చిరాగ్‌… రెండో సెట్‌లో మాత్రం తడబడింది. ఒక దశలో ఆధిక్యం సాధించే అవకాశం ఉన్న సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో అనవసర తప్పిదాలు భారత్‌ కొంపముంచాయి.

ఈ మ్యాచ్‌లో ఓడినప్పటకీ మెడల్ సాధించడం ద్వారా సాత్విక్‌-చిరాగ్‌ షెట్టి చరిత్ర సృష్టించారు. పురుషుల డబుల్స్‌లో వరల్డ్ ఛాంపియన్‌షిప్ మెడల్ రావడం ఇదే తొలిసారి. అలాగే ఓవరాల్‌గా భారత్‌కు ఇది 13వ మెడల్‌. గతంలో దిగ్గజ ఆటగాడు ప్రకాశ్ పదుకునే పురుషుల సింగిల్స్‌లో గెలవగా… హైదరాబాదీ స్టార్ షట్లర్ పివి సింధు ఐదు పతకాలు సాధించింది. అలాగే మరో స్టార్ ప్లేయర్ సైనానెహ్వాల్ రెండు మెడల్స్ , సాయిప్రణీత్‌ , కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ ఒక్కో పతకం సాధించారు. డబుల్స్‌లో మాత్రం భారత్‌కు ఇది రెండో మెడల్‌. గతంలో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప కూడా కాంస్యం సాధించారు. కాగా వరల్డ్ బ్యాడ్మింటన్‌లో గత కొంత కాలంగా డబుల్స్‌లో భారత జోడీ సాత్విక్‌-చిరాగ్ అదరగొడుతున్నారు. ఆల్ ఇంగ్లాండ్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన ఈ జోడీ తర్వాత ఇండియా ఓపెన్, థామస్ కప్ , కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. తాజాగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ మెడల్ గెలిచి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.

Exit mobile version