CWG 2022:రెజ్లర్ల పతక పట్టు ఖాయమే

అంతర్జాతీయ క్రీడా వేదికల్లో భారత్‌కు ఖచ్చితంగా పతకాలు తెచ్చే క్రీడ ఏదైనా ఉందంటే అది రెజ్లింగే. పోటీ ఏదైనా మన రెజ్లర్లు మాత్రం తప్పకుండా పతకాన్ని తీసుకొస్తూ భారత కీర్తి పతాకాలను విశ్వవ్యాప్తం చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - July 28, 2022 / 04:30 PM IST

అంతర్జాతీయ క్రీడా వేదికల్లో భారత్‌కు ఖచ్చితంగా పతకాలు తెచ్చే క్రీడ ఏదైనా ఉందంటే అది రెజ్లింగే. పోటీ ఏదైనా మన రెజ్లర్లు మాత్రం తప్పకుండా పతకాన్ని తీసుకొస్తూ భారత కీర్తి పతాకాలను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. కేడీ జాదవ్ నుంచి రవి దహియా వరకు ఎంతో మంది రెజ్లర్లు ప్రపంచ పోటీల్లో మన సత్తా ఏంటో చూపించారు. గురువారం నుంచి బర్మింగ్హామ్ వేదికగా 2022 కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. దీంతో మరోసారి భారత రెజ్లర్లపై ఫాన్స్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఈ సారి ఎక్కువ సంఖ్యలో పతకాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో భజరంగ్ పునియా కాంస్యంతో ఆకట్టుకున్నాడు. ఇప్పటికే 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాన్ని, అంతకుముందు 2014లో రజతంతో ఆకట్టుకున్న పునియా.. ముచ్చటగా మూడో సారి కామన్వెల్త్ స్వర్ణంతో హ్యాట్రిక్ పతకాలను సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. 2018 ఆసియా గేమ్స్‌లోనూ స్వర్ణంతో అదరగొట్టిన పునియాపై అంచనాలు ఎక్కవగానే ఉన్నాయి.

ఇక 24 ఏళ్ల రవి కుమార్ దహియా.. గతేడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో రజతాన్ని కైవసం చేసుకున్నాడు. ఆసియాన్ ఛాంపియన్షి‌ప్స్‌లో స్వర్ణాన్ని కూడా నెగ్గిన ఈ రెజ్లర్‌పై కూడా అంచనాలున్నాయి. ఈ సారి కామన్వెల్త్ పోటీల్లో సత్తా చాటి గోల్డ్ సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. మరోవైపు మహిళల విభాగంలో వినీశ్ ఫొగాట్‌పై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. టోక్యో ఒలింపిక్స్ లో క్వార్టర్స్ ఫైనల్‌లో పరాజయం పాలైన వినేశ్ కామన్వెల్త్‌లో సత్తా చాటి తానేంటో నిరూపించుకోవాలని చూస్తోంది. గత పోటీల్లో స్వర్ణాలను కైవసం చేసుకున్న ఈ రెజ్లర్.. మూడో పతకంపై కన్నేసింది. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో రెండింటిలో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ మహిళగా వినేశ్ ఘనత సాదించింది.

2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్యంతో ఆకట్టుకున్న సాక్షి మాలిక్ దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ ఏడాది అల్మాటీ వేదికగా బోలట్ టర్లీఖానోవ్ కప్‌లో స్వర్ణం సాధించి తాను కూడా రేసులో ఉన్నానని నిరూపించింది. 2014 కామన్వెల్త్‌లో వెండిని కైవసం చేసుకున్న సాక్షి.. 2108లో కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ సారి ఎలాగైనా స్వర్ణాన్ని చేజిక్కించుకోవాలని ఈ ఒలింపిక్ మెడలిస్ట్ పట్టుదలగా ఉంది. ఇక 20 ఏళ్ల అన్షు మాలిక్ తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో పోటీ పడనుంది. గతేడాది జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో మహిళల డివిజన్‌లో రజతం సొంతం చేసుకుని ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా వరల్డ్ కప్‌, ఆసియన్ ఛాంపియన్‌షిప్స్‌లో వ్యక్తిగత మెడల్స్‌ను సొంతం చేసుకుంది. వీరితో పాటు మరో తొమ్మిది మల్లయోధులు కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటున్నారు. వీరిలో ఎవ్వరినీ తక్కువ అంచనా వేయడానికి లేదు. దీంతో రెజ్లింగ్‌లో ఈ సారి పతకాల పట్టు ఖాయంగా కనిపిస్తోంది.