Ind W Team: తొలి టీ ట్వంటీలో భారత మహిళల ఓటమి

సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ ట్వంటీ సిరీస్‌ను భారత మహిళల జట్టు ఓటమితో ఆరంభించింది.

  • Written By:
  • Publish Date - December 9, 2022 / 11:07 PM IST

సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ ట్వంటీ సిరీస్‌ను భారత మహిళల జట్టు ఓటమితో ఆరంభించింది. ముంబై వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 172 పరుగుల భారీస్కోర్ చేసింది. టాపార్డర్, మిడిలార్డర్ సమిష్టిగా రాణించారు. ఓపెనర్లు షెఫాలీ వర్మ 21 , స్మృతి మంధాన 28 పరుగులు చేయగా.. రోడిగ్స్ మాత్రం డకౌటైంది. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ 21 , దేవిక వైద్య 25 నాటౌట్ రాణించారు. వీరిద్దరితో పాటు చివర్లో వికెట్ కీపర్ రిఛా గోష్‌, దీప్తి శర్మ మెరుపులు మెరిపించారు. రిఛా కేవలం 20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 36 , దీప్తి శర్మ 15 బంతుల్లోనే 8 ఫోర్లతో 36 రన్స్ చేయడంతో స్కోర్ 170 దాటింది. కాగా ఈ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంజలి శర్వాణి భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. అటు రెగ్యులర్ కెప్టెన్ లానింగ్ దూరమవడంతో ఆసీస్‌కు హీలీ కెప్టెన్‌గా వ్యవహరించింది.

173 పరుగుల లక్ష్యఛేదనలో ఆసీస్ మహిళల జట్టు ధాటిగానే ఆడింది. తొలి వికెట్‌కు ఓపెనర్లు మూనీ, కెప్టెన్ హల్ 8.5 ఓవర్లలోనే 73 పరుగులు జోడించారు. భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో వారి దూకుడు కొనసాగింది. కెప్టెన్ హీలీ 23 బంతుల్లో 4 ఫోర్లు , 2 సిక్సర్లతో 37 పరుగులకు ఔటవగా.. తర్వాత మెక్‌గ్రాత్‌ ధాటిగా ఆడడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 100 పరుగులు జోడించారు. మూనీ కేవలం 57 బంతుల్లో 16 ఫోర్లతో 89 నాటౌట్ , మెక్‌గ్రాత్‌ 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో ఆస్ట్రేలియా మహిళల జట్టు 18.1 ఓవర్లలో టార్గెట్‌ను ఛేదించింది. ఈ విజయంతో ఐదు టీ ట్వంటీల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌లో రెండో మ్యాచ్ ఆదివారం ముంబైలోనే జరుగుతుంది.