CWG 2022: సెమీస్ లో భారత మహిళల క్రికెట్ జట్టు

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత మహిళల జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. గేమ్స్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బార్బడోస్‌ పై టీమిండియా100 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది

  • Written By:
  • Publish Date - August 4, 2022 / 10:13 AM IST

కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత మహిళల జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. గేమ్స్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బార్బడోస్‌ పై టీమిండియా100 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది.తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

స్టార్ ప్లేయర్ స్మృతి మందన నిరాశ పరిచినా…షెఫాలీ వర్మ, రోడ్రిగ్స్ కలిసి ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి రెండో వికెట్ కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షెఫాలీ వర్మ 26 బంతుల్లో ఒక సిక్సర్, ఏడు ఫోర్లతో 43 రన్స్ చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ డకౌట్ కాగా తానియా భాటియా 6 పరుగులకే వెనుదిరిగింది.

ఈ దశలో రోడ్రిగ్స్ తో కలిసి దీప్తి శర్మ ఇండియా కు మంచి స్కోరు అందించింది. రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీతో మెరిసింది. 46 బాల్స్ లో ఓ సిక్సర్, ఆరు ఫోర్లతో 56 రన్స్ చేయగా.. దీప్తిశర్మ 28 బంతుల్లో ఓ సిక్సర్, రెండు ఫోర్లతో 34 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బార్బడోస్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేక పోయింది. కేవలం 62 రన్స్ కే పరిమితమయింది.బార్బడోస్ బ్యాటర్లలో క్యాషోనా నైట్ 16 రన్స్, షకీరా 12 రన్స్ మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. భారత బౌలర్ రేణుక సింగ్ నాలుగు ఓవర్లలో 10 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్ల పడగొట్టగా… మేఘన సింగ్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, హర్మన్ ప్రీత్ తలో వికెట్ తీసుకున్నారు. న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌ మధ్య విజేతతో టీమిండియా మహిళల జట్టు సెమీస్‌లో తలపడనుంది. సెమీస్‌లో గెలిస్తే మాత్రం టీమిండియా మహిళల జట్టుకు పతకం ఖాయమవుతుంది.