Site icon HashtagU Telugu

Asia Cup 2022:మహిళల ఆసియా కప్ లో భారత్ బోణీ

Jemimah Rodrigues

Jemimah Rodrigues

ఆసియాకప్ ను భారత మహిళల క్రికెట్ జట్టు ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్ లో శ్రీలంకపై 41 రన్స్ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 150 పరుగులు చేసింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన విఫలమవడంతో భారత్ 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో చిచ్చర పిడుగు జెమీమా రోడ్రిగ్స్ మెరుపు ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకుంది. హాఫ్ సెంచరీతో రాణించి జట్టుకు మంచి స్కోర్ అందించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌‌తో కలిసి రోడ్రిగ్స్ మూడో వికెట్‌కి 92 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది.

హర్మన్ ప్రీత్ 30 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులకు ఔటవగా.. రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీ సాధించింది. తద్వారా అతి చిన్న వయసులో వుమెన్స్ టీ20 ఆసియా కప్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. గతంలో బంగ్లాదేశ్ ప్లేయర్ ఫర్గానా హుక్ 25 ఏళ్ల 79 రోజుల వయసులో హాఫ్ సెంచరీ చేయగా.. జెమీమా రోడ్రిగ్స్ 22 ఏళ్ల 26 రోజుల్లో ఈ ఘనత సాధించింది. రోడ్రిగ్స్ 53 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 76 పరుగులకు ఔటయింది. 151 పరుగుల లక్ష్యఛేదనలో శ్రీలంకను భారత బౌలర్లు కట్టడి చేశారు. పవర్ ప్లే లోనే ఓపెనర్లను పెవిలియన్ కు పంపారు. తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో లంక కోలుకోలేకపోయింది. ఆ జట్టు బ్యాటర్లను క్రీజులో కుదురుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో లంక 109 రన్స్ కే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో హేమలత 3 , పూజ 2 , దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టారు.
ఇదిలా ఉంటే ఆసియాకప్ లో భారత మహిళల జట్టుకు అద్భుతమైన రికార్డుంది. వన్డే ఫార్మాట్‌లో నాలుగుసార్లు , టీ20 ఫార్మాట్‌లో రెండు టైటిల్స్ గెలుచుకుంది. కొవిడ్ కారణంగా నాలుగేళ్లుగా మహిళల ఆసియాకప్ వాయిదా పడుతూ వస్తుండగా… 2012 నుంచి ఈ టోర్నీని టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు.