Site icon HashtagU Telugu

Gautam Gambhir: మ‌రికాసేప‌ట్లో భార‌త్‌- పాక్ మ్యాచ్‌.. కోచ్ గంభీర్ స్పంద‌న ఇదే!

Gautam Gambhir

Gautam Gambhir

Gautam Gambhir: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 2025 మ్యాచ్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేయాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అయితే భారత్ ప్రభుత్వం మల్టీ-నేషన్ టోర్నమెంట్లలో మాత్రమే పాకిస్తాన్‌తో ఆడుతుందని స్పష్టం చేసింది. దీని కారణంగానే ఆసియా కప్‌లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ రయాన్ టెన్ డోషాటే, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) టీమ్‌ ఇచ్చిన సందేశాన్ని వెల్లడించారు.

రయాన్ టెన్ డోషాటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు జట్టు వాతావరణం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టును మ్యాచ్‌పై దృష్టి పెట్టమని చెప్పారని తెలిపారు. “గౌతమ్ గంభీర్ సందేశం ఏంటంటే మనం ప్రొఫెషనల్‌గా ఉండాలి. భావోద్వేగాలను పక్కన పెట్టాలి. మన ముందు ఉన్న మ్యాచ్‌పై దృష్టి పెట్టాలి. ప్రతి ఒక్కరికీ భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు. కానీ జట్టు దృష్టి మొత్తం క్రికెట్‌పైనే ఉంది. ఇది ఒక సున్నితమైన అంశం. ఆసియా కప్ చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉంది. ఒక సమయంలో మేము బహుశా ఇక్కడకు రాలేమని అనుకున్నాం. కానీ ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం. క్రీడాకారులు తమ భావోద్వేగాలను పక్కన పెట్టి తమ పని చేయాలి” అని రయాన్ చెప్పారు.

Also Read: Heavy Rain : తెలంగాణ లో నేడు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు

BCCI, ప్రభుత్వ సూచనలను పాటిస్తున్న టీమ్ ఇండియా

టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ రయాన్ టెన్ డోషాటే మాట్లాడుతూ.. తాము BCCI, ప్రభుత్వం సూచనలను పాటిస్తున్నామని చెప్పారు. “క్రీడలను, రాజకీయాలను వేరుగా ఉంచాలా వద్దా అని మనం చర్చించుకోవచ్చు. ప్రతి ఒక్కరికీ భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు. ప్రస్తుతానికి మేము BCCI, ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకుంటున్నాము. మేము ఎలా ఆడతామో, అది దేశం పట్ల మాకు ఉన్న భావాలను చూపిస్తుందని ఆశిస్తున్నాము” అని ఆయన అన్నారు.

గతంలో పాక్‌తో మ్యాచ్‌ల‌ను వ్యతిరేకించిన గంభీర్

టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా మారడానికి ముందు ఒక ఇంటర్వ్యూలో గౌతమ్ గంభీర్ భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు జరగకూడదని చెప్పారు. “సరిహద్దులో ఉగ్రవాదం ఆగనంత వరకు భారత్- పాకిస్తాన్ మధ్య ఏమీ జరగకూడదు. అయితే, ఇది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం” అని గంభీర్ గతంలో పేర్కొన్నారు.

Exit mobile version