టీ ట్వంటీ వరల్డ్ కప్ బెర్త్ వయా ఆసియా కప్

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న మెగా టోర్నీ టీ ట్వంటీ వరల్డ్ కప్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ టోర్నీలో ఆడేందుకు టీమిండియా యువ క్రికెటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 15 మంది జాబితాలో చోటు దక్కించుకోవాలంటే ఆసియా కప్ లో ఆకట్టుకోవాలి. అంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ బెర్త్ ఆసియా కప్ పెర్ఫార్మెన్స్ పై ఆధారపడి ఉంది.

  • Written By:
  • Publish Date - August 13, 2022 / 12:01 PM IST

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న మెగా టోర్నీ టీ ట్వంటీ వరల్డ్ కప్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ టోర్నీలో ఆడేందుకు టీమిండియా యువ క్రికెటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే 15 మంది జాబితాలో చోటు దక్కించుకోవాలంటే ఆసియా కప్ లో ఆకట్టుకోవాలి. అంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ బెర్త్ ఆసియా కప్ పెర్ఫార్మెన్స్ పై ఆధారపడి ఉంది.
ఆసియా కప్ కంటే ముందు జింబాబ్వే సిరీస్ ఉన్నప్పటకీ అందరి దృష్టీ ఆసియా కప్ వైపే ఉంది. జింబాబ్వే టూర్ కు పలువురు సీనియర్లకు రెస్ట్ ఇవ్వడమే దీనికి కారణం. కాగా ఆసియా కప్ ప్రదర్శనతో టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం పలువురు యువ ఆటగాళ్ళను ఊరిస్తోంది. సహచరుల గాయాలు, టీ ట్వంటీ ఫార్మేట్ కావడమే దీనికి కారణం. ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగుతోంది. ఇప్పటికే ఏడు సార్లు ఆసియా కప్ టైటిల్ గెలిచిన భారత జట్టు, గత సీజన్‌లో టైటిల్ అందించిన రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే ఈసారి కూడా టోర్నీ ఆడనుంది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు జరుగుతున్న ఆసియా కప్.. విరాట్ కోహ్లీతో పాటు పలువురు యువ ఆటగాళ్ళకు కీలకంగా మారింది 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ పెద్దగా క్రికెట్ ఆడింది లేదు. ఆడిన మ్యాచుల్లోనూ పెద్దగా రాణంచ లేదు. దీంతో టీ ట్వంటీ జట్టులో కోహ్లీ ప్లేస్ గురించి పెద్ద చర్చే జరుగుతోంది. కపిల్ దేవ్ , వెంకటేశ్ ప్రసాద్ వంటి మాజీ ఆటగాళ్ళు చేసిన కామెంట్లు కూడా దుమారం రేపాయి.

ఆ నేపథ్యంలో టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు ఆసియా కప్‌లో కోహ్లీ ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ విఫలమైతే మాత్రం వరల్డ్ కప్ లో కోహ్లీ ప్లేస్ ప్రమాదంలో పడుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు. మరోవైపు టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టులోకి ఎంపికయ్యేందుకు ఆసియా కప్ యువ ఆటగాళ్ళకు అద్భుతమైన అవకాశం. స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా‌తో పాటు హర్షల్ పటేల్ కూడా గాయపడడంతో 10 మ్యాచులు కూడా అనుభవం లేని ఆవేశ్ ఖాన్‌కి ఆసియా కప్ కు ఎంపిక చేశారు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో 3 ఓవర్లలోనే 47 పరుగులిచ్చిన ఆవేశ్ ఖాన్, ఆ తర్వాతి మ్యాచ్‌లో 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఐపీఎల్‌లో నిలకడగా రాణించిన ఆవేశ్ ఖాన్‌కి ఆసియా కప్ లో ఆకట్టుకుంటే మాత్రం టీ ట్వంటీ టీమ్ ఎంపికలో పరిగణలోకి తీసుకుంటారు. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్ ఇచ్చే ప్రదర్శనే కీలకం కానుంది. అటు స్పిన్ విభాగంలో రవి బిష్ణోయ్ కి ఆసియాకప్ మంచి అవకాశం. కుల్దీప్ యాదవ్‌ని కాదని యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్‌కి సెలక్టర్లు అవకాశమిచ్చారు. బిష్ణోయ్ 9 టీ ట్వంటీల్లో 15 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి టీ20లో ఏకంగా 4 వికెట్లు తీసిన భిష్ణోయ్… ఆసియా కప్‌లో అదరగొడితే మాత్రం వరల్డ్ కప్ టీమ్ ప్లేస్ పట్టేయొచ్చు. ఇదిలా ఉంటే టీ ట్వంటీ ప్రపంచకప్ కు ఖచ్చితంగా ఎంపికవుతాడన్న అంచనాలున్నవికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కు ఆసియా కప్ లో సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నాడు. జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత డీకే అద్భుతంగా రాణిస్తున్నాడు. ఫినిషర్ రోల్ పోషిస్తున్న దినేశ్ కార్తీక్ ఆసియాకప్ లో చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే ఇప్పటికే కెఎల్ రాహుల్ రీఎంట్రీ ఇవ్వడంతో దినేశ్ కార్తీక్‌కి తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. ఆసియా కప్‌లో ఒకటి లేదా రెండు మ్యాచుల్లో డీకేకి అవకాశం దక్కొచ్చు. దీంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే దినేశ్ కార్తీక్ వరల్డ్ కప్ లో ఆడినట్టేనని భావిస్తున్నారు. ఒకవేళ దినేశ్ కార్తీక్ ఫెయిలైనా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌ కూడా ఆప్షన్స్ గా ఉన్నారు. మొత్తం మీద ఆసియాకప్ పెర్ఫార్మెన్స్ తో ఆస్ట్రేలియాలో జరిగే వరల్డ్ కప్ బెర్త్ దక్కించుకునేందుకు ఆటగాళ్ళు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.