Site icon HashtagU Telugu

T20 WC Food:సరైన ఫుడ్ కూడా అందించలేరా.. ? ఐసీసీపై టీమిండియా ఫైర్

Team India Vs Aus Imresizer

Team India Vs Aus Imresizer

టీ ట్వంటీ ప్రపంచకప్ ఆతిథ్య నిర్వహణలో ఐసీసీపై విమర్శలు వస్తున్నాయి. భారత లాంటి అగ్రశ్రేణి జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. వార్మప్ మ్యాచ్ ల సమయంలో 3 స్టార్ హోటల్ బుక్ చేసిన నిర్వాహకులపై అప్పుడు టీమిండియా కెప్టెన్ తో పాటు మేనేజ్ మెంట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లోనూ ఇలాంటి సమస్యే ఎదురైంది. ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత మంచి భోజనం తిందామనుకున్న భారత క్రికెటర్లకు షాక్ తగిలింది. ప్రాక్టీస్ అనంతరం వేడి ఆహారం ఇవ్వకపోవడంతో కొంతమంది ప్లేయర్లు హోటెల్ రూమ్‌కు వచ్చి భోజనం చేయాల్సి వచ్చింది.

కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్ , పంత్ వంటి ప్లేయర్స్ అందరూ ఉదయం నుంచే ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నారు. నెట్ సెషన్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో ఏర్పాటు చేసిన ఫుడ్ ఏమాత్రం బాగాలేదని బీసీసీఐ సహాయక సిబ్బంది ఒకరు చెప్పారు. దీనిపై ఆటగాళ్ళందరూ అసహనానికి గురైనట్టు తెలుస్తోంది. అక్కడ ఏం తినకుండా నేరుగా హోటల్ వెళ్ళిపోయినట్టు మేనేజ్ మెంట్ తెలిపింది. తర్వాత బీసీసీఐతో పాటు ఐసీసీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. వార్మప్ మ్యాచ్ ల సమయంలోనూ టీమిండియాకు సరైన వసతి కల్పించలేదన్న ఫిర్యాదు వచ్చింది. భారత్ జట్టుకు 3 స్టార్ హోటల్ బుక్ చేయడం బీసీసీఐకి సైతం నచ్చలేదు. తాజాగా ఫుడ్ విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురవడంతో బీసీసీఐ కూడా ఐసీసీపై ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే
ఈ ఆప్షన్ ప్రాక్టీస్‌ సెషన్‌లో టీమిండియా ఆటగాళ్లంతా పాల్గొనలేదు. హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, స్పిన్నర్ అక్షర్ పటేల్ సహా ఫాస్ట్ బౌలర్లు ఈ సెషన్‌కు విశ్రాంతి తీసుకున్నారు. గురువారం నాడు నెదర్లాండ్స్ జట్టుతో సిడ్నీ వేదికగా టీమిండియా తన రెండో మ్యాచ్ ఆడబోతుంది.