India Vs NZ 2nd ODI: రాయ్‌పూర్‌లో బౌలర్లు అదుర్స్…భారత్ ఖాతాలో మరో సిరీస్‌

సొంతగడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వన్డేల్లో నెంబర్ వన్ టీమ్ న్యూజిలాండ్‌ను చిత్తూ చేస్తూ సిరీస్ కైవసం చేసుకుంది.

  • Written By:
  • Publish Date - January 21, 2023 / 06:30 PM IST

India vs NZ: సొంతగడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వన్డేల్లో నెంబర్ వన్ టీమ్ న్యూజిలాండ్‌ను చిత్తూ చేస్తూ సిరీస్ కైవసం చేసుకుంది. తొలి వన్డేలో బ్యాటర్లు చెలరేగితే… రాయ్‌పూర్ వేదికగా ఈ సారి బౌలర్లు అదరగొట్టారు. పదునైన పేస్‌తో చెలరేగిపోయారు. టీమిండియా బౌలర్లు పూర్తి ఆధిపత్యం కనబరిచిన వేళ కొత్త ఏడాదిలో మరో సిరీస్ విజయం మన ఖాతాలో చేరింది.

గట్టిపోటీ ఇస్తుందనుకున్న కివీస్ చేతులెత్తేయడంతో రాయ్‌పూర్‌ మ్యాచ్‌ వన్‌సైడ్‌గా ముగిసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్‌ నిర్ణయం సరైనదేనని నిరూపిస్తూ తొలి ఓవర్ నుంచే మన పేసర్లు చెలరేగిపోయారు. పేస్ పిచ్‌పై షమీ, సిరాజ్, శార్థూల్ ఠాకూర్ అదరగొట్టారు.

వీరి జోరుకు కివీస్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. మొదటి ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే ఔటవగా… కివీస్ 15 రన్స్‌కే 5 వికెట్లు కోల్పోయింది. ఫిన్ అలెన్ డకౌటవగా…కాన్వే 7 , నికోల్స్‌ 2 , మిఛెల్ 1 , లాథమ్ 1 పరుగుకే ఔటయ్యారు. ఈ దశలో గ్లెన్ ఫిలిప్స్ , బ్రేస్‌వెల్ పోరాడడంతో స్కోరు 100 దాటింది. ఫిలిప్స్ 36, బ్రేస్‌వెల్ 22, శాంట్నర్ 27 రన్స్ చేయగా… న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ 108 పరుగులకు ముగిసింది. భారత బౌలర్లలో షమీ 3, పాండ్యా 2, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీయగా… సిరాజ్, శార్థూల్ ఠాకూర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. తర్వాత 109 పరుగుల టార్గెట్‌ను రోహిత్‌సేన సునాయాసంగా ఛేదించింది. తొలి వికెట్‌కు ఓపెనర్లు రోహిత్ , గిల్ 72 పరుగులు జోడించారు. ఎట్టకేలకు రోహిత్ ఫామ్‌లోకి రావడం ఫ్యాన్స్‌కు ఆనందం కలిగించింది.

హిట్‌మ్యాన్ 50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 రన్స్ చేసి ఔటయ్యాడు. తర్వాత గిల్, కోహ్లీ దూకుడుగా ఆడారు. విజయం ముంగిట కోహ్లీ స్టంపౌట్ అవగా…గిల్ , ఇషాన్ కిషన్ విజయా్ని పూర్తి చేశారు. కాగా ఈ విజయంతో భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. సిరీస్‌లో చివరి మ్యాచ్ మంగళవారం ఇండోర్‌లో జరుగుతుంది. వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంటుంది.