CWG Triple Jump: ట్రిపుల్‌ జంప్‌లో స్వర్ణం, రజతం.. జావెలిన్‌ త్రోలో కాంస్యం

కామన్‌వెల్త్‌ గేమ్స్ అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శన అద్భుతంగా సాగుతోంది.

  • Written By:
  • Updated On - August 7, 2022 / 08:20 PM IST

కామన్‌వెల్త్‌ గేమ్స్ అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శన అద్భుతంగా సాగుతోంది. అంచనాలకు మించి మన అథ్లెట్లు ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో రాణిస్తున్నారు. ఈ క్రీడల్లో ఇప్పటికే లాంగ్‌ జంప్‌లో మురళీ శ్రీశంకర్‌, మహిళల రేస్‌ వాక్‌లో ప్రియాంక గోస్వామి, పురుషుల స్టీపుల్‌ఛేజ్‌లో అవినాష్‌సాబ్లే, హై జంప్‌లో తేజస్విన్‌ శంకర్‌ పతకాలు సాధిస్తే… తాజాగా మరో మూడు పతకాలు ఖాతాలో వేసుకుంది.

పురుషుల ట్రిపుల్‌ జంప్‌ ఈవెంట్‌లో ఎల్దోస్‌ పాల్‌ స్వర్ణం …ఇదే ఈవెంట్‌లో అబ్దుల్లా అబూబకర్ రజత పతకం సాధించి కామన్‌వెల్త్‌ క్రీడల్లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. వీరిద్దరు ఒకే ఈవెంట్‌లో గోల్డ్‌, సిల్వర్‌ సాధించడంతో భారత్‌ కామన్‌వెల్త్‌ క్రీడల్లో సరికొత్త ఆధ్యాయాన్ని లిఖించింది. గతంలో ఈ క్రీడల అథ్లెటిక్స్‌ విభాగంలో ఒకే ఈవెంట్‌లో భారత్‌ ఎన్నడూ స్వర్ణం, రజతం సాధించింది లేదు. ఎల్డ్‌హోస్ పాల్ 17.03 మీటర్ల దూరం దూకి స్వర్ణం కైవసం చేసుకోగా.. అబ్దుల్లా అబూబకర్ 17.02 మీటర్లు దూకి రజతం గెలిచాడు.
ఇదే ఈవెంట్‌లో భారత్‌ కాంస్యం గెలిచే అవకాశాన్ని కూడా తృటిలో చేజార్చుకుంది. ప్రవీన్‌ చిత్రవేళ్‌ 0.03 మీటర్ల మార్జిన్‌తో కాంస్యం గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు. అతను 16.89మీటర్ల దూరం జంప్ చేయగా.. బెర్ముడాకు చెందిన జా-నై పెరిన్‌చీఫ్‌ 16.92 మీటర్లు జంప్‌ చేసి కాంస్య పతకం సాధించాడు. ఇదిలా ఉంటే పురుషుల 10000 మీటర్ల రేస్‌ వాక్ ఫైనల్స్‌లో భారత అథ్లెట్ సందీప్ కుమార్ కాంస్యం గెలిచాడు. 10 వేల మీటర్ల రేస్ వాక్‌ని 38:49.21 సెకన్లలో ముగించిన సందీప్, మూడో స్థానంలో నిలిచాడు. ఈ గేమ్స్‌ రేస్‌ వాక్‌లో భారత్‌కి ఇది రెండో పతకం. మహిళల 10 వేల మీటర్ల రేస్ వాక్‌లో ప్రియాంక గోస్వామికి సిల్వర్ దక్కింది. ఇదిలా ఉంటే జావెలిన్‌ త్రోలో భారత్‌ తొలి పతకం సాధించింది. మహిళల కేటగిరీలో అన్నూ రాణి జావెలిన్‌ను 60.03 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకం గెలిచింది.

కామన్‌వెల్త్‌ క్రీడల చరిత్రలో మహిళల విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కాగా ఓవరాల్‌గా మూడో మెడల్. కాగా అథ్లెటిక్స్‌లో ఈ స్థాయి ప్రదర్శన భారత్ గతంలో ఎన్నడూ కనబరచలేదు. అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పలువురు మెడల్స్ సాధించడం క్రీడాభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ ప్రదర్శనతో వచ్చే ఒలింపిక్స్‌లో మన అథ్లెట్లపై అంచనాలు పెరుగుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.