Site icon HashtagU Telugu

India Women Win Series: 15 ఏళ్ల తర్వాత ఇంగ్లీష్ గడ్డపై సీరీస్ విజయం

India Women Imresizer

India Women Imresizer

భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. సుదీర్ఘ కాలం తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై వన్డే సిరీస్ గెలుచుకుంది. రెండో వన్డేలోనూ అదరగొట్టిన హర్మన్ ప్రీత్ అండ్ కో 88 రన్స్ తేడాతో ఇంగ్లీష్ టీమ్ ను చిత్తు చేసింది. టీ ట్వంటీ సీరీస్ చేజార్చుకున్న భారత్ వన్డే ఫార్మాట్ లో మాత్రం పూర్తి ఆధిపత్యం కనబరిచింది. వరల్డ్ క్రికెట్ లో సొంత గడ్డపై బలంగా ఉన్న ఇంగ్లాండ్ కు ఓటమి రుచి చూపించింది. బ్యాటింగ్ లో హర్మన్ ప్రీత్ చెలరేగితే…బౌలింగ్ లో రేణుకా సింగ్ , హేమలత రాణించారు.
మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ మహిళల జట్టు 333 పరుగుల భారీ స్కోరు సాధించింది. 99 రన్స్ కు 3 వికెట్లు కోల్పోయిన దశలో హర్మన్ ప్రీత్ , డియోల్ ఇన్నింగ్స్ గాడిన పెట్టారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 113 పరుగులు జోడించారు. డియోల్ 58 రన్స్ ఔటవగా…చివర్లో హర్మన్ ప్రీత్ ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఒక దశలో 290 రన్స్ చేస్తుందనుకున్న టీమిండియా 333 రన్స్ చేసిందంటే దానికి కారణం హర్మన్ ప్రీత్ దూకుడే. ముఖ్యంగా చివరి 4 ఓవర్లలో బౌండరీల వర్షం కురిపించింది. ఈ క్రమంలో కెరీర్ లో 5వ సెంచరీ పూర్తి చేసుకుంది. చివరి 3 ఓవర్లలో భారత్ 63 రన్స్ చేసిందంటే హర్మన్ దూకుడు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లాండ్ పై వన్డేల్లో భారత్ కి ఇదే అత్యధిక స్కోర్. హర్మన్ ప్రీత్ 111 బంతుల్లో 18 ఫోర్లు , 4 సిక్సర్లతో 143 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేక పోయింది. భారత బౌలర్లు కట్టడి చేయడంతో వేగంగా ఆడలేక పోయింది. 47 రన్స్ కే 3 వికెట్లు కోల్పోగా…ఫామ్ లో ఉన్న వ్యాత్, కాప్సే, వికెట్ కీపర్ జోన్స్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వ్యాత్ హాఫ్ సెంచరీ చేయగా…మధ్యలో మరోసారి పుంజుకున్న భారత బౌలర్లు వరుస వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను కట్టడి చేశారు. దీంతో ఇంగ్లాండ్ మహిళల జట్టు 44.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బౌలర్ రేణుకా సింగ్ 4 , హేమలత 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సీరీస్ కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ గడ్డపై భారత్ చివరి సారిగా 2007 లో వన్డే సిరీస్ గెలిచింది. సీరీస్ లో చివరి మ్యాచ్ శనివారం లండన్ లో జరుగుతుంది.