Ind Vs Pak CWG: కామన్‌వెల్త్ వేదికగా చిరకాల ప్రత్యర్థుల పోరు

భారత్‌,పాకిస్థాన్‌... ఈ రెండు దేశాలూ క్రికెట్ నుంచి హాకీ వరకూ... ఏ క్రీడల్లో ఎక్కడ తలపడినా ఆ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

  • Written By:
  • Publish Date - July 31, 2022 / 09:30 AM IST

భారత్‌,పాకిస్థాన్‌… ఈ రెండు దేశాలూ క్రికెట్ నుంచి హాకీ వరకూ… ఏ క్రీడల్లో ఎక్కడ తలపడినా ఆ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరకాల ప్రత్యర్థుల మధ్య సమరం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కేవలం ఈ రెండు దేశాల అభిమానులే కాదు విదేశీ ఫ్యాన్స్‌ను సైతం ఈ పోరు ఆకర్షిస్తుంది. క్రికెట్‌లో అయితే ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సారి టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో దాయాదులు తలపడనుండగా.. అంతకంటే ముందే భారత్,పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్ల మధ్య పోరు జరగనుంది.

బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్‌గేమ్స్‌ వేదికగా దాయాది దేశాల మధ్య క్రికెట్ వార్ జరగబోతోంది. ఆదివారం మధ్యాహ్నం జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకూ ఎంతో కీలకం. తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు గెలుపు దశ నుంచి పరాజయం పాలైంది. మంచి స్కోరే చేయడం… తర్వాత బౌలింగ్‌లోనూ రాణించి ఆరంభంలోనే 4 కీలక వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించేలా కనిపించింది. అయితే చివర్లో తడబడి మ్యాచ్‌ను చేజార్చుకుంది. నిజానికి ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో భారత్ అంచనాలకు మించి రాణించిందనేది అంగీకరించాల్సిందే. హర్మన్ ప్రీత్ కౌర్ అర్ధ సెంచరీ సాధిస్తే.. షఫాలీ వర్మ 48 పరగులతో సత్తా చాటింది.

స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ధాటిగా ఆడినా,,,యస్తిక భాటియా, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్ విఫలమవడం ప్రభావం చూపింది. ఇక బౌలింగ్ లో రేణుక సింగ్ ఏకంగా నాలుగు వికెట్లతో మెరిస్తే…దీప్తి శర్మ 2 వికెట్లు సాధించింది. అయితే రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ లు నిరాశపరిచారు. వీరు కూడా రాణించి ఉంటే గెలుపు అందేది. ప్రస్తుతం మరోసారి ఆస్ట్రేలియా చేసిన స్ఫూర్తిదాయక ప్రదర్శన రిపీట్ చేస్తే పాక్‌పై గెలవడం భారత్‌కు కష్టమేమీ కాదు.

మరోవైపు పాకిస్థాన్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకం కానుంది. తొలి మ్యాచ్‌లో ఆ జట్టు అనూహ్యంగా చిన్న టీమ్ బార్బడోస్ చేతిలో ఓడిపోయింది. పతకం ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్‌ను ఓడించాల్సి ఉంటుంది. రికార్డుల పరంగా, బలబలాల పరంగా పాకిస్థాన్‌కు అంత ఈజీ కాదు. ఇరు జట్లకూ అత్యంత కీలకంగా మారిన ఈ పోరులో భారత మహిళల జట్టునే ఫేవరెట్‌గా భావిస్తున్నారు.