Site icon HashtagU Telugu

Women Cricket: భారత మహిళలదే టీ ట్వంటీ సిరీస్‌

Indian Women Cricket

Indian Women Cricket

శ్రీలంక పర్యటనలో భారత మహిళల జట్టు అదరగొడుతోంది. వరుసగా రెండో టీ ట్వంటీలోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో హర్మన్‌ప్రీత్ సేన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన లంక మహిళల జట్టును భారత బౌలర్లు కట్టడి చేశారు. ఓపెనర్లు రాణించినా.. మిగిలిన బ్యాటర్లను క్రీజులో కుదురుకోనివ్వలేదు.ఓపెనర్లు విష్మి 45, చమారి 43 పరుగులు చేయగా.. తొలి వికెట్‌కు 80 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పారు. దీంతో లంక భారీస్కోరు చేసేలా కనిపించింది. అయితే లంక ఇన్నింగ్స్‌ సెకండాఫ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. వెంటవెంటనే వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచారు. ఓపెనర్ల తర్వాత లంక జట్టులో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేదు. దీంతో శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు తీసుకోగా.. రేణుకాసింగ్, పుజా వస్త్రాకర్, హర్మన్‌ప్రీత్, రాధా యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్‌కు 3.4 ఓవర్లలో 30 పరుగులు జోడించారు. షెఫాలీ వర్మ 17, మేఘన 17 రన్స్‌కు ఔటైనా… కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్, మంధాన కలిసి ఇన్నింగ్స్ నడిపించారు. వీరిద్దరూ నిలకడగా ఆడడంతో భారత్ సునాయాసంగానే గెలిచింది. చివర్లో మరో మూడు వికెట్లు చేజారినా భారీ లక్ష్యం కాకపోవడంతో భారత్ మరో 5 బంతులు మిగిలుండగానే టార్గెట్ ఛేదించింది. మంధాన 34 బంతుల్లో 8 ఫోర్లతో 34 పరుగులు చేయగా.. హర్మన్‌ప్రీత్‌ కౌర్ 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఈ విజయంతో మూడు టీ ట్వంటీల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది.సిరీస్‌లో చివరి మ్యాచ్ సోమవారం జరగనుంది. తర్వాత మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జట్లూ తలపడనున్నాయి.

Exit mobile version