Site icon HashtagU Telugu

IND-W vs THAI-W: మహిళల ఆసియాకప్ ఫైనల్లో భారత్

India Women Cricket Team

India Women Cricket Team

మహిళల ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో భారత్ దుమ్మురేపుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న హర్మన్ ప్రీత్ సేన తాజాగా ఫైనల్లో అడుగుపెట్టింది.సెమీఫైనల్లో పసికూన థాయ్ లాండ్ పై భారీ విజయాన్ని అందుకుంది. 74 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులు చేసింది. స్మృతి మంధాన 13 రన్స్ కే ఔటైనా.. ఫామ్ లో ఉన్న షెఫాలీ వర్మ మరోసారి మెరుపులు మెరిపించింది. 28 బంతుల్లోనే 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 42 పరుగులు చేసింది. రోడ్రిక్స్ 27, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 30 , పూజా వస్త్రాకర్ 17 పరుగులతో రాణించారు. చివర్లో థాయ్ లాండ్ బౌలర్లు భారత్ ను కట్టడి చేశారు.

149 పరుగుల లక్ష్యఛేదనలో థాయ్ లాండ్ మహిళల జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. దీప్తి శర్మ చెలరేగడంతో 21 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. సింగిల్స్ తీసేందుకు కూడా భారత బౌలర్లు థాయ్ లాండ్ కు అవకాశమివ్వలేదు. దీంతో 20 ఓవర్లలో థాయ్ లాండ్ 9 వికెట్లకు 74 పరుగులే చేయగలిగింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 , రాజేశ్వరి 2, స్నేహా రాణా, రేణుకా సింగ్ , షెఫాలీ వర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. సెమీస్ లో ఓడినప్పటకీ ఈ టోర్నీలో థాయ్ లాండ్ ఆకట్టుకుంది. పాకిస్థాన్ పై సంచలన విజయం సాధించిన ఆ జట్టు తొలిసారి ఆసియాకప్ లో సెమీస్ చేరింది. మరోవైపు టైటిల్ ఫేవరెట్ గా ఉన్న భారత మహిళల జట్టు ఫైనల్లో పాకిస్థాన్ లేదా శ్రీలంక జట్ల మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో తలపడుతుంది.