Team India: ఘనంగా టైటిల్ వేట షురూ… పాక్‌పై భారత మహిళల గ్రాండ్ విక్టరీ

మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ మహిళల జట్టును 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

  • Written By:
  • Updated On - February 12, 2023 / 11:01 PM IST

Team India: మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ మహిళల జట్టును 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. గత రికార్డుల ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఈ మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మునీబా 12, జవేరియా 8 పరుగులకే ఔటవగా.. కెప్టెన్ మరూఫ్ హాఫ్ సెంచరీతో ఆదుకుంది. నిదా దార్ డకౌటైనప్పటకీ… అయేశా నసీమ్ ధాటిగా ఆడింది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. మరూఫ్ 55 బంతుల్లో 7 ఫోర్లతో 68 పరుగులు చేయగా.. చివర్లో మెరుపులు మెరిపించిన అయేశా కేవలం 25 బంతుల్లోనే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసింది. దీంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్లు 149 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 2 , దీప్తి శర్మ 1, పూజా వస్త్రాకర్ 1 వికెట్‌ పడగొట్టారు.

ఛేజింగ్‌లో భారత్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. తొలి వికెట్‌కు యస్తికా భాటియా, షెఫాలీ వర్మ 38 పరుగులు జోడించారు. భాటియా 17 పరుగులకు ఔటవగా.. దూకుడుగా ఆడిన షెఫాలీ 25 బంతుల్లో 4 ఫోర్లతో 33 రన్స్ చేసింది. తర్వాత హర్మన్‌ప్రీత్‌కౌర్‌ 16 రన్స్‌కే ఔటైనప్పటకీ.. జెమీ రోడ్రిగ్స్ అదరగొట్టింది. చాలా కాలంగా ఫామ్‌లోకి వచ్చేందుకు ఎదురుచూస్తున్న రోడ్రిక్స్ హాఫ్ సెంచరీతో రాణించింది. 38 బంతుల్లోనే 8 ఫోర్లతో 53 పరుగులు చేసింది. అటు వికెట్ కీపర్ రిఛా ఘోష్ మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగింది. కేవలం 20 బంతుల్లోనే 5 ఫోర్లతో 31 పరుగులు చేసింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 58 పరుగులు జోడించారు. దీంతో భారత్ మరో ఓవర్ మిగిలుండగానే టార్గెట్‌ను ఛేదించింది. తర్వాతి మ్యాచ్‌లో ారత్ వెస్టిండీస్‌తో ఫిబ్రవరి 15న తలపడుతుంది.