Site icon HashtagU Telugu

T20 Series Win: టీ ట్వంటీ సీరీస్ కూడా మనదే

Team India West Indies Imresizer

Team India West Indies Imresizer

కరేబియన్ టూర్ లో టీమిండియా మరో సిరీస్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ ట్వంటీ మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో గెలుచుకుంది. బ్యాటింగ్ లో సమిష్టిగా రాణిస్తే…బౌలింగ్ లో అవేష్ ఖాన్, అర్ష దీప్ సింగ్ అదరగొట్టారు.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ మరోసారి భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ఇచ్చిన మెరుపు ఆరంభంతో స్కోర్ బోర్డు ఫస్ట్ గేర్ లో పరిగెత్తింది. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ తొలి వికెట్ కు 4.4 ఓవర్లలో 54 పరుగులు జోడించారు. రోహిత్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 33 , సూర్య కుమార్ 14 బంతుల్లో 24 రన్స్ చేశారు. వీరిద్దరు ఔటయ్యాక దీపక్ హుడా.. రిషభ్ పంత్ ఇద్దరూ నిలకడగా ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.

వీరిద్దరూ మూడో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రిషభ్‌ పంత్‌ 31 బంతుల్లో 6 ఫోర్లతో 44 రన్స్ చేయగా..హుడా 21 పరుగులకు ఔటయ్యాడు.
చివర్లో సంజూ శాంసన్ , అక్షర్ పటేల్ కూడా ధాటిగా ఆడటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. సంజూ 23 బంతుల్లో 30 , అక్షర్ పటేల్ 8 బాల్స్ లో 20 రన్స్ చేశారు. విండీస్‌ బౌలర్‌ మెకాయ్‌ 4 ఓవర్లలో 66 పరుగులిచ్చాడు.

అనంతరం లక్ష్యఛేదనలో విండీస్ ను భారత్‌ బౌలర్లు కట్టడి చేశారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ స్కోరుబోర్డును ముందుకు కదలనివ్వలేదు. వెస్టిండీస్‌ బ్యాటర్లలో పావెల్‌ 24, నికోలస్‌ పూరన్ 24 మినహా మిగతా వారెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. భారత్‌ బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. 3 ఓవర్లు వేసి కేవలం 12 పరుగులు ఇవ్వగా… ఆవేశ్ ఖాన్ 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. స్పినర్ రవి రవి బిష్ణోయ్‌ కూడా రెండు వికెట్లు తీశాడు. ఆవేశ్ ఖాన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో భారత్ టీ ట్వంటీ సీరీస్ కైవసం చేసుకుంది. సీరీస్ లో చివరి మ్యాచ్ ఇవాళ జరగనుంది.