Site icon HashtagU Telugu

T20 World Cup: టీమిండియా ఘ‌న‌విజ‌యం.. వరల్డ్ కప్ 2025 టైటిల్ భార‌త్‌దే!

T20 World Cup

T20 World Cup

T20 World Cup: భారతదేశ ఆడబిడ్డలు మరోసారి దేశ కీర్తిని ఇనుమడింపజేశారు. భారత మహిళల బ్లైండ్ టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా నేపాల్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్‌లో నేపాల్ భారత జట్టు ముందు 115 పరుగుల లక్ష్యాన్ని ఉంచగా.. భారత జట్టు కేవలం 12.1 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. మొత్తం టోర్నమెంట్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగింది. ఏ మ్యాచ్ కూడా ఓడిపోకుండా ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

టీమ్ ఇండియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది

భారత జట్టు బ్లైండ్ టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ టీసీ దీపిక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. నేపాల్ బ్యాటర్లు భారత బౌలర్ల ముందు సులభంగా లొంగిపోయారు. ఆ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి కేవలం 114 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Also Read: Luxury Cities: ప్రపంచంలోని 10 అత్యంత విలాసవంతమైన నగరాలు ఇవే!

115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు తరఫున ఖులా షరిర్ మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసింది. ఖులా కేవలం 27 బంతులు ఎదుర్కొని 44 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఇన్నింగ్స్ సందర్భంగా ఆమె సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగింది. మహిళల బ్లైండ్ టీ20 ప్రపంచ కప్‌ను మొదటిసారిగా నిర్వహించడం విశేషం.

సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది

దీనికి ముందు భారత జట్టు సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లలో భారత ఆడబిడ్డలు పాకిస్తాన్‌ను కూడా 8 వికెట్ల తేడాతో చిత్తు చేశారు. బ్లైండ్ టీ20 ప్రపంచ కప్ మొదటి ఎడిషన్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొన్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నేపాల్. ఈ టోర్నమెంట్ నవంబర్ 11న ప్రారంభమైంది. ప్రారంభ మ్యాచ్‌లు ఢిల్లీలో ఆ తర్వాత బెంగళూరులో జరిగాయి. ఆ తర్వాత నాకౌట్ మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యం ఇచ్చింది.

Exit mobile version