Site icon HashtagU Telugu

World Cup 2023: రోహిట్‌..సూపర్ హిట్‌ ఆప్ఘనిస్తాన్‌పై భారత్ ఘనవిజయం

World Cup 2023 (28)

World Cup 2023 (28)

World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో భారత్ దుమ్మురేపుతోంది. ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్‌లో కాస్త పోటీనిచ్చిన ఆప్ఘన్‌ బౌలింగ్‌లో మాత్రం తేలిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘనిస్థాన్‌ ఆరంభంలో తడబడి నిలబడింది. ఓపెనర్లు గుర్బాజ్ , ఇబ్రహీం జడ్రాన్‌ తొలి వికెట్‌కు 32 పరుగులు జోడించారు. తర్వాత రహమత్ కూడా 16 రన్స్‌కే ఔటవగా..ఆప్ఘన్ 3 వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ షాహిది , అజ్మతుల్లా కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. వీరిద్దరి జోరుతో ఆప్ఘనిస్తాన్ భారీస్కోర్ చేసేలా కనిపించింది. అయితే పాండ్యా వీరి పార్టనర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. అజ్మతుల్లా 62 , షాహిది 80 పరుగులకు ఔటయ్యారు. చివర్లో టెయిలెండర్లు ఓ మోస్తారుగా రాణించడంతో ఆప్ఘనిస్తాన్ 272 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బూమ్రా 4 , పాండ్యా 2 , శార్థూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ పేసర్ సిరాజ్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 9 ఓవర్లలో 76 పరుగులు ఇచ్చాడు.

లక్ష్యఛేదనలో టీమిండియా ఓపెనర్లు దూకుడుగా ఆడారు. కెప్టెన్ రోహిత్‌శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గత మ్యాచ్‌లో డకౌట్ అయ్యానన్న కసితో కనిపించిన రోహిట్ ఆఫ్ఘన్ బౌలర్లను ఆటాడుకున్నాడు. అయితే ఫోర్ , లేకుంటే సిక్సర్ అన్న రీతిలో ఆడాడు. ఇషాన్ కిషన్ కాస్త నిదానంగానే ఆడినా రోహిత్‌ మాత్రం దుమ్మురేపాడు. దీంతో మ్యాచ్ వన్‌సైడ్‌గా మారిపోయింది. రోహిత్ , ఇషాన్ కిషన్ తొలి వికెట్‌రు 18.4 ఓవర్లలోనే 156 పరుగులు జోడించారు. హిట్‌మ్యాన్‌ భారీ షాట్లతో కేవలం 63 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత కూడా మరింత దూకుడుగా ఆడిన రోహిత్ పలు రికార్డులు అందుకున్నాడు. ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. రోహిత్ 19 ఇన్నింగ్స్‌లలో 7 శతకాలు సాధించాడు. అలాగే వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అటు వరల్డ్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. రోహిత్ 84 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్లతో 131 పరుగులు చేశాడు. ఓపెనర్లు ఔటైన తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ జట్టు విజయాన్ని పూర్తి చేశారు. ఫామ్ కొనసాగించిన కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో భారత్ 35 ఓవర్లలోనే టార్గెట్‌ను అందుకుంది. రోహిత్‌శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తర్వాతి మ్యాచ్‌లో భారత్ శనివారం పాకిస్తాన్‌తో తలపడుతుంది.

Also Read: World Cup 2023: రోహిత్ ఉగ్రరూపం .. సెంచరీతో వీరవిహారం

Exit mobile version