Site icon HashtagU Telugu

Indian WK stuff stolen: లండన్ హోటల్‌లో టీమిండియా ప్లేయర్‌ తానియాకు చేదు అనుభవం…క్లీన్ స్వీప్ చేశారని రూమ్‌లోకి దూరి బ్యాగు చోరీ!!

Taniya Imresizer

Taniya Imresizer

ఇంగ్లాండ్ టూర్‌లో దుమ్ములేపి వన్డే సిరీస్‌ని 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన ఇండియా మహిళల క్రికెట్ టీమ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఇవాళ ఇంగ్లండ్ నుంచి ఇండియాకు మన టీమ్ తిరిగి రావాల్సి ఉంది. ఈ తరుణంలో ఇండియా మహిళల క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ తానియా భాటియా బ్యాగ్ హోటల్ గదిలో చోరీకి గురైంది. విలువైన వస్తువులతో కూడిన తన బ్యాగ్ చోరీకి గురైంది అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు.

బ్యాగులో నగదు, కార్డులు, వాచీలు, నగలు..

ఇంగ్లాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో చివరి మ్యాచ్ సందర్భంగా భారత మహిళల జట్టు లండన్ లోని మారియట్ హోటల్ లో బస చేసింది. ఈ సందర్భంగా తానియా భాటియా బ్యాగ్ కనిపించకుండా పోయింది. ఆ బ్యాగులో నగదు, కార్డులు, వాచీలు, నగలు ఉన్నాయని తానియా భాటియా వాపోయింది. ఖరీదైన వస్తువులున్న బ్యాగ్ చోరీకి గురికావడం దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆమె తెలిపింది. తన గదిలోకి ఎవరో వచ్చారని, వారే తన బ్యాగ్ చోరీ చేసి ఉంటారని తానియా పేర్కొంది. ” హోటల్ లో భద్రతా వైఫల్యం విస్మయానికి గురిచేస్తోంది. త్వరగా దర్యాప్తు జరిపి, ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తేవాలి. నా బ్యాగును తిరిగి నాకు అప్పగించాలి. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, తమ దేశంలో పర్యటించే క్రికెటర్లకు ఇలా భద్రత లేని హోటళ్లలో బస కల్పిస్తారని అనుకోలేదు” అని తానియా వ్యాఖ్యానించింది.

మారియట్ హోటల్ క్షమాపణలు

ఈ ఘటనపై లండన్ లోని మారియట్ హోటల్ స్పందించింది. టీమిండియా మహిళా క్రికెటర్ తానియాకు క్షమాపణలు తెలియజేసింది. ఏ తేదీల్లో తమ హోటల్ లో బస చేసిందో ఆ వివరాలను పంపిస్తే ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.

ఎవరో కావాలనే..

వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు క్లీన్ స్వీప్ అయిన తర్వాత ఈ సంఘటన జరగడంతో ఎవరో కావాలనే ఈ పనికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. టీమిండియా గెలవడాన్ని తట్టుకోలేక ఇంగ్లాండ్ అభిమానులు చేతికి పని చెప్పి ఉంటారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక ఇంగ్లాండ్‌తో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో తానియా భాటియాకి బదులుగా యష్తికా భాటియాని ఆడించింది టీమిండియా. వచ్చే నెలలో ఆరంభం కానున్న ఆసియా కప్ 2022 మహిళల టోర్నీకి ప్రకటించిన జట్టులోనూ వికెట్ కీపర్ తానియా భాటియాకి చోటు దక్కింది.