100th Test: భారత్ (India), వెస్టిండీస్ (West Indies) మధ్య జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రెండో, చివరి మ్యాచ్ జూలై 20, గురువారం (నేడు) నుంచి జరగనుంది. ఈ టెస్టు ద్వారా భారత్, వెస్టిండీస్ జట్లు 100వ టెస్టు (100th Test) తలపడనున్నాయి. మరోవైపు వెస్టిండీస్‌తో ఈ టెస్టు ద్వారా భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. ఇరుజట్ల మధ్య ఈ మ్యాచ్ ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరగనుంది.
అంతకుముందు డొమినికా వేదికగా జరిగిన టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య జరిగే 100వ టెస్టులో ఏ జట్టు గెలుస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకు ఏ జట్టు పైచేయి సాధించింది
భారత్, వెస్టిండీస్ మధ్య ఇప్పటివరకు జరిగిన 99 టెస్టు మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ జట్టు ముందంజలో ఉంది. భారత్ కంటే వెస్టిండీస్ ఎక్కువ విజయాలు సాధించింది. వెస్టిండీస్ 99 టెస్టుల్లో 30 మ్యాచ్‌లు గెలవగా, భారత జట్టు 23 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. అదే సమయంలో ఇరుజట్ల మధ్య 46 టెస్టులు డ్రాగా ముగిశాయి.
విరాట్ కోహ్లీ 500వ అంతర్జాతీయ మ్యాచ్‌కు రంగంలోకి దిగనున్నాడు
భారత వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 499 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. నేడు వెస్టిండీస్‌తో జరగనున్న రెండో టెస్టు ద్వారా అంతర్జాతీయ కెరీర్‌లో 500 మ్యాచ్‌లు ఆడిన 10వ ఆటగాడిగా కోహ్లీ నిలవనున్నాడు. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రికార్డు భారత మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట నమోదైంది. అతను తన కెరీర్‌లో మొత్తం 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. కోహ్లీ గురించి మాట్లాడుకుంటే.. అతను ఇప్పటివరకు 499 మ్యాచ్‌లు ఆడిన 558 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేస్తూ 53.48 సగటుతో 25461 పరుగులు చేశాడు. ఈ సమయంలోఅతని బ్యాట్ నుండి 75 సెంచరీలు, 131 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇందులో అతని అత్యధిక స్కోరు 254 * పరుగులు.