T20 Series : టీ ట్వంటీ సీరీస్ లో బోణీ ఎవరిదో..?

వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను వైట్‌వాష్ చేసిన టీమిండియా ఇప్పుడు టీ ట్వంటీలపై కన్నేసింది. ఈడెన్ గార్డెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనున్న మూడు టీ ట్వంటీల సిరీస్ బుధవారం నుండే మొదలుకానుంది.

  • Written By:
  • Publish Date - February 15, 2022 / 07:31 PM IST

వెస్టిండీస్‌పై వన్డే సిరీస్‌ను వైట్‌వాష్ చేసిన టీమిండియా ఇప్పుడు టీ ట్వంటీలపై కన్నేసింది. ఈడెన్ గార్డెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనున్న మూడు టీ ట్వంటీల సిరీస్ బుధవారం నుండే మొదలుకానుంది. రోహిత్‌శర్మ సారథ్యంలోనే భారత్ చివరిగా న్యూజిలాండ్‌పై టీ ట్వంటీ సిరీస్ ఆడి క్లీన్‌స్వీప్ చేసింది. మరోసారి అటువంటి ప్రదర్శనే రిపీట్ చేయడం ద్వారా విండీస్‌నూ చిత్తు చేయాలని భావిస్తోంది. అదే జరిగితే సారథిగా బాధ్యతలు చేపట్టి ఆరంభంలోనే వరుసగా మూడు సిరీస్‌లు స్వీప్ చేసిన కెప్టెన్‌గా రోహిత్‌ రికార్డు సృష్టిస్తాడు. ఇదిలా ఉంటే ఈ సిరీస్‌లో పలువురు యువ క్రికెటర్లు అరంగేట్రం చేసే అవకాశం కనిపిస్తోంది. ఓపెనర్‌గా రోహిత్ శర్మకు తోడు ఇషాన్ కిషన్ , రుతురాజ్‌లలో ఒకరికి చోటు దక్కనుండగా.. కోహ్లీ, సూర్యకుమార్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్‌ల బ్యాటింగ్ ఆర్డర్‌లో తర్వాత రానున్నారు. ఏడో స్థానంలో దీపక్‌ హుడా ఆడే అవకాశముండగా…ఆల్‌రౌండర్ కోటాలో దీపక్ చాహర్‌, శార్థూల్ ఠాకూర్ పోటీపడుతున్నారు. గత కొంతకాలంగా పరిమిత ఓవర్ల ఫార్మేట్‌లో వీరిద్దరూ నిలకడగా రాణిస్తుండడం అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు.

అటు బౌలింగ్‌లోనూ తుది జట్టుకు సంబంధించి గట్టిపోటీనే నెలకొంది. పేస్ విభాగంలో భువనేశ్వర్‌తో పాటు హర్షల్ పటేల్, అవేశ్‌ ఖాన్‌లలో ఒకరు ఆడనున్నారు. గత ఐపీఎల్ సీజన్‌లో పర్పుల్ క్యాప్ అందుకున్న హర్షల్ పటేల్‌ అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్ విభాగంలో రవి బిష్ణోయ్ పోటీనిచ్చినా చాహల్‌కు అవకాశం దక్కొచ్చు. టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు జట్టు కూర్పును సిద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో పూర్తి ప్రయోగాలకు మేనేజ్‌మెంట్ సిద్ధంగా లేదని తెలుస్తోంది. సిరీస్ ఆరంభ మ్యాచ్‌ కావడంతో భారీ మార్పులు అయితే చేయకపోవచ్చని సమాచారం. మరోవైపు వన్డే సిరీస్‌లో విఫలమైనప్పటకీ… విండీస్‌ను షార్ట్ ఫార్మేట్‌లో తేలిగ్గా తీసుకోలేం. ఐపీఎల్ ఆడడంతో ఇక్కడి పిచ్‌లపై కరేబియన్ క్రికెటర్లకు కూడా మంచి అవగాహనే ఉంటుందని చెప్పొచ్చు. వన్డే సిరీస్ తరహాలో కాకుండా టీ ట్వంటీ సిరీస్ హోరాహోరీగా సాగుతుందని అంచనా వేస్తున్నారు. కోవిడ్ ఆంక్షల కారణంగా ఈ మ్యాచ్‌కి అభిమానులను అనుమతించడం లేదు.