India vs South Africa: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మెరుపు బ్యాటింగ్ దెబ్బకు టీమిండియా (India vs South Africa) దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రొటీస్ జట్టు నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. రోహిత్ శర్మ 73 బంతుల్లో 75 పరుగులు చేయగా, యశస్వి తన వన్డే కెరీర్‌లో మొట్టమొదటి సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు వైజాగ్‌లో కూడా విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ మాయాజాలం చూపించారు. ఈ విజయంతో భారత జట్టు వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
యశస్వి-రోహిత్ ధమాకా
271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత జట్టుకు యశస్వి జైస్వాల్- రోహిత్ శర్మ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 25.5 ఓవర్లలో 155 పరుగులు జోడించారు. ఈ సిరీస్‌లో అద్భుతమైన ఫామ్‌లో కనిపించిన హిట్ మ్యాన్ (రోహిత్), వైజాగ్‌లో తన బ్యాటింగ్‌తో అలరించాడు. రోహిత్ 73 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 75 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి రెండు మ్యాచ్‌లలో విఫలమైన యశస్వి ఈ మ్యాచ్‌లో చెలరేగాడు. యశస్వి తన వన్డే కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. అజేయంగా 116 పరుగులు సాధించాడు. మొదటి రెండు వన్డేల్లో సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ మూడో వన్డేలో అజేయంగా అర్ధ సెంచరీ చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ ఈ మ్యాచ్‌లో 65 పరుగులు సాధించాడు.
Also Read: Yashasvi Jaiswal Century: యశస్వి జైస్వాల్ తొలి వన్డే సెంచరీ.. అప్పుడు ధోనీ!!
ప్రసిద్ధ్- కుల్దీప్ విజృంభణ
తొలుత టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభం సరిగా లేదు. రయాన్ రికెల్టన్ ఖాతా తెరవకుండానే అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత డి కాక్‌కు కెప్టెన్ టెంబా బావుమా మంచి జోడీగా నిలవగా, వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బావుమా 48 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే ఒక వైపు నుంచి డి కాక్ తన అద్భుతమైన బ్యాటింగ్‌ను కొనసాగించి 80 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. డి కాక్ 89 బంతులు ఎదుర్కొని 106 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
అయితే డి కాక్ అవుట్ అయిన తర్వాత ప్రొటీస్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ దారుణంగా కుప్పకూలింది. ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా జట్టు మొత్తం 270 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కుల్దీప్ యాదవ్ 10 ఓవర్లలో 41 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా 9.5 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు
