India vs South Africa: నవీ ముంబైలో భారత్, దక్షిణాఫ్రికా (India vs South Africa) మధ్య జరుగుతున్న 2025 మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 298 పరుగులు చేసింది. భారత్ తరఫున ఓపెనర్ షఫాలీ వర్మ 78 బంతుల్లో 87 పరుగుల ధాటిగా ఆడినప్పటికీ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయింది. ఆమె భాగస్వామి స్మృతి మంధాన 45 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇన్నింగ్స్ చివర్లో దీప్తి శర్మ, రిచా ఘోష్ శక్తివంతమైన బ్యాటింగ్‌తో స్కోరును 300 పరుగులకు దగ్గరగా తీసుకెళ్లారు.
అయితే చివరి 5 ఓవర్లలో టీమ్ ఇండియా కేవలం 36 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ కారణంగానే భారత జట్టు 300 పరుగుల మార్కును దాటలేకపోయింది. ఒకానొక సమయంలో భారత జట్టు సులభంగా 320 పరుగులకు చేరుకుంటుందని అనిపించింది. కానీ దక్షిణాఫ్రికా బౌలర్లు డెత్ ఓవర్లలో భారత బ్యాట్స్‌మెన్‌లను భారీ షాట్లు ఆడకుండా కట్టడి చేశారు. 45 ఓవర్లలో భారత్ స్కోరు 262 పరుగులుగా ఉన్నప్పటికీ.. చివరి ఐదు ఓవర్లలో నెమ్మదించడం వల్ల 300 మార్కును అందుకోలేకపోయింది. అయినప్పటికీ ఇది మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఫైనల్‌లో నమోదైన రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం.
Also Read: IND W vs SA W: హర్మన్‌ప్రీత్ సేనకు ఆస్ట్రేలియా నుంచే సూర్యకుమార్ సేన మద్దతు!
భారత్ బ్యాటింగ్‌లో స్మృతి మంధాన 58 బంతుల్లో 8 ఫోర్ల సహాయంతో 45 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగుల ఇన్నింగ్స్ ఆడింది. గత మ్యాచ్ సెంచరీ చేసిన జెమిమా రోడ్రిగేజ్ 37 బంతుల్లో 24 పరుగులు చేసి ఔట్ అయ్యింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాట్ కూడా పెద్దగా రాణించలేదు. ఆమె 29 బంతుల్లో 2 ఫోర్లతో 20 పరుగులు చేసింది. దీప్తి శర్మ 58 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 58 పరుగులు చేసి చివరి బంతికి రనౌట్ అయ్యింది. రిచా ఘోష్ కీలకమైన 34 పరుగులు చేసింది. 24 బంతుల్లో ఆమె 3 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టింది. అమన్‌జోత్ కౌర్ 12 పరుగులు చేసి ఔట్ అయ్యింది.
దక్షిణాఫ్రికా బౌలింగ్ ప్రదర్శన
దక్షిణాఫ్రికా తరఫున అయాబొంగా ఖాకా 9 ఓవర్లలో 58 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచింది. ఆమెతో పాటు క్లో ట్రయాన్, నాన్‌కులులేకో మ్లాబా, నాదిన్ డి క్లర్క్ ఒక్కొక్క వికెట్ చొప్పున తీశారు.
