Ind Vs SA 3rd T20: గెలిస్తేనే నిలిచేది

సొంతగడ్డపై సౌతాఫ్రికాతో సిరీస్‌లో అనూహ్యంగా రెండు మ్యాచ్‌లు ఓడిన టీమిండియా ఇప్పుడు కీలకపోరుకు సిద్ధమైంది.

  • Written By:
  • Publish Date - June 14, 2022 / 08:15 AM IST

సొంతగడ్డపై సౌతాఫ్రికాతో సిరీస్‌లో అనూహ్యంగా రెండు మ్యాచ్‌లు ఓడిన టీమిండియా ఇప్పుడు కీలకపోరుకు సిద్ధమైంది. సిరీస్ చేజారే ప్రమాదం పొంచి ఉన్న వేళ మూడో టీ ట్వంటీలో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి నెలకొంది.విశాఖ వేదికగా జరగనున్న ఈ పోరులో ఒత్తిడంతా భారత జట్టు పైనే.

కీలక ఆటగాళ్ళు విశ్రాంతి తీసుకున్నా.. కొందరు గాయాలతో దూరమైనా ఐపీఎల్‌లో చెలరేగిన యువ ఆటగాళ్ళపై అంచనాలు నెలకొన్నాయి. అయితే తొలి రెండు మ్యాచ్‌లలో ఈ అంచనాలు అందుకోవడంలో మన ఆటగాళ్ళు విఫలమయ్యారు. తొలి మ్యాచ్‌లో బౌలర్లు నిరాశపరిస్తే.. రెండో మ్యాచ్‌లో బ్యాటర్లు చేతులెత్తేశారు. అదే సమయంలో పంత్ కెప్టెన్సీ వైఫల్యం కూడా వరుస ఓటములకు కారణమైంది.

దీంతో విశాఖలో జరగనున్న మూడో మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఆశలు నిలుపుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. గత రెండు ఓటముల దృష్ట్యా తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే అన్ని విభాగాల్లోనూ సమిష్టిగా రాణిస్తే తప్ప సఫారీల జోరుకు బ్రేక్ వేయలేమన్నది అంగీకరించాల్సిందే. ఓపెనర్లు మంచి ఆరంభాన్నివ్వలేకపోవడం ప్రధాన ఇబ్బందిగా చెప్పొచ్చు. అటు మిడిలార్డర్‌ కూడా నిలకడగా రాణిస్తే భారీస్కోర్ సాధించొచ్చు.

మరోవైపు బౌలింగ్‌లో భువనేశ్వర్ ఫామ్‌లోకి రావడం కలిసొచ్చే అంశం. తొలి రెండు మ్యాచ్ ల్లో హర్షల్ పటేల్ , అవేశ్ ఖాన్ పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. అలాగే స్పిన్నర్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఐపీఎస్ స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశముండగా…ఎవరిపై వేటు పడుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఓ పెద్ద స్కోరు చేస్తే పనైపోదని, గెలుపు దక్కదని తొలి మ్యాచ్‌లోనే సఫారీలు నిరూపించారు. కాబట్టి బౌలర్ల పాత్ర కూడా కీలకమే. వికెట్లు తీయడంలో ఏమాత్రం పట్టుసడలించకుండా ఉంటేనే విజయం దక్కుతుంది.

ఇదిలా ఉంటే వరుసగా రెండు విజయాలతో సౌతాఫ్రికా ఇప్పుడు సిరీస్ విజయంపై కన్నేసింది. ఐపీఎల్‌లో ఆడడం ద్వారా ఇక్కడ పరిస్థితులగా బాగా అలవాటు పడిన సఫారీ క్రికెటర్లు అదే ఫామ్ కొనసాగిస్తున్నారు. కాగా మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న విశాఖ స్టేడియంలో భారత్‌కు మంచి రికార్డే ఉంది. చాలా రోజుల తర్వాత ఇక్కడ అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండగా.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో మరోసారి టాస్ కీలకం కానుంది.