Site icon HashtagU Telugu

India vs SL: తుది జట్టు నుంచి ఆ ఇద్దరూ ఔట్.. మూడో వన్డేకు భారత ఫైనల్ ఎలెవన్ ఇదే!

India Batters

India Batters

India vs SL: శ్రీలంక పర్యటనలో భారత్ కు తొలి ఓటమి ఎదురైంది. అనూహ్యంగా రెండో వన్డేలో లంక విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో లంక గెలిచిందనడం కంటే భారత్ (India vs SL) చేజేతులా ఓడిందని చెప్పొచ్చు. ఎందుకంటే బౌలింగ్ లో 136 పరుగులకే 6 వికెట్లు పడగొట్టిన భారత్ తర్వాత మరో 100 పరుగులు చేసే అవకాశాన్ని లంకకు ఇచ్చారు. చివర్లో పట్టుచేజార్చుకోవడం అనే తమ సంప్రదాయాన్ని రెండో వన్డేలోనూ కొనసాగించారు. ఇక బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ తప్పిస్తే మిగిలిన వారంతా ఫ్లాపయ్యారు. విరాట్ కోహ్లీ రెండో మ్యాచ్ లోనూ నిరాశపరిచాడు. అలాగే శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, శివమ్ దూబే వైఫల్యాల బాట వీడలేదు. ముఖ్యంగా కెఎల్ రాహుల రెండు వన్డేలోనూ డకౌటయ్యాడు. అలాగే కీపింగ్ లోనూ పేలవ ప్రదర్శనతో పలు క్యాచ్ లు వదిలేశాడు. ఇక ఆల్ రౌండర్ శివమ్ దూబే తనకిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు.

ఈ నేపథ్యంలో శ్రీలంకతో జరిగే మూడో వన్డేకు భారత తుది జట్టులో మార్పులు జరగనున్నాయి. వైఫల్యాల వీడని కెఎల్ రాహుల్, శివమ్ దూబేలను తప్పించనున్నారు. వీరిద్దరి స్థానంలో రిషబ్ పంత్, రియాన్ పరాగ్ తుది జట్టులోకి రానున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు కూర్పుపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టిన గౌతమ్ గంభీర్ పంత్ ను మూడో వన్డేలు ఆడించడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే టీ ట్వంటీ సిరీస్ లో బంతితో రాణించిన పరాగ్ కు చోటు దక్కే అవకాశముంది. ఇక మిగిలిన కాంబినేషన్ లో మాత్రం మార్పులు జరిగే అవకాశం లేదు. ఓపెనర్లు గిల్, రోహిత్ రానుండగా.. తర్వాత కోహ్లీ దిగుతాడు. ఇక బౌలింగ్ లో భారత్ ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగనుంది. జడేజా రీప్లేస్ మెంట్ గా భావిస్తున్న అక్షర్ పటేల్ ఆల్ రౌండర్ గా బరిలోకి దిగనుండగా..వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ కూడా చోటు దక్కించుకోనున్నారు. పేస్ బాధ్యతలను మహ్మద్ సిరాజ్ , అర్షదీప్ సింగ్ పంచుకోనున్నారు.

Also Read: Women’s T20 World Cup: బంగ్లాలో మహిళల T20 వరల్డ్ కప్ డౌటే..!

ఇదిలా ఉంటే లంకతో తొలి వన్డే టై కావడం, రెండో వన్డే చేజార్చుకోవడంతో భారత్ సిరీస్ లో 0-1తో వెనుకబడింది, సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా చివరి వన్డేలో టీమిండియా గెలిచి తీరాలి. ఈ కారణంగానే తుది జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

మూడో వన్డేకు భారత తుది జట్టు అంచనా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.