Women’s T20 World Cup Schedule: అక్టోబర్ లో జరగనున్న మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. నిజానికి ఈ మెగా టోర్నీ బంగ్లాదేశ్ లో జరగాల్సి ఉండగా… అక్కడి అనిశ్చితి రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో టోర్నీని యుఏఈ వేదికగా నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. దీనిపై గత వారమే నిర్ణయం తీసుకున్నా షెడ్యూల్ ను స్వల్ప మార్పులు చేసి తాజాగా ప్రకటించింది.
వరల్డ్ కప్ మ్యాచ్ లకు దుబాయ్ , షార్జా ఆతిథ్యమివ్వనున్నాయి. అక్టోబర్ 3 నుంచి 20 వరకూ ఈ మెగా టోర్నీ జరగనుంది. మొత్తం 10 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక.. గ్రూప్ బిలో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి. గ్రూప్‌లోని ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరతాయి.
టైటిల్ ఫేవరెట్స్ లో ఒకటైన భారత్ షెడ్యూల్ ను చూస్తే తొలి మ్యాచ్ లో అక్టోబర్ 4న న్యూజిలాండ్ తలపడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కు దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది. ఇక అక్టోబర్ 9న శ్రీలంకతోనూ, అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతోనూ భారత్ తలపడనుంది. మొత్తం 23 మ్యాచ్ లు అభిమానులను అలరించనుండగా… సెమీఫైనల్స్ , ఫైనల్ మ్యాచ్ లకు రిజర్వే డేలను కేటాయించారు. ఇక సెప్టెంబరు 28 నుంచి అక్టోబర్ 1 వరకు వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇప్పటివరకు మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ ఎనిమిది సార్లు జరిగితే.. ఆస్ట్రేలియా ఆరుసార్లు ఛాంపియన్ గా నిలిచింది. 2020 ఎడిషన్ లో ఫైనల్ కు చేరిన భారత మహిళల జట్టు తుదిపోరులో మాత్రం నిరాశపరిచింది. ఆసీస్ చేతిలో ఓడి రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఈ సారి అంచనాలకు తగ్గట్టు రాణించి టైటిల్ గెలవాలని భారత్ పట్టుదలగా ఉంది. అయితే మరోసారి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు టైటిల్ రేసులో గట్టిపోటీ ఇవ్వనున్నాయి. ఇదిలా ఉంటే టోర్నీని యూఏఈకి తరలించినప్పటికీ బంగ్లాదేశ్ తన ఆతిథ్య హక్కులను నిలబెట్టుకుంది. తర్వాతి ఎడిషన్ లేదా భవిష్యత్తులో మరోసారి బంగ్లాదేశ్ కు టోర్నీ నిర్వహించే అవకాశం దక్కుతుంది.
Also Read: BJP : జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ-ఏజేఎస్‌యూ పొత్తు