T20 World Cup: మెల్‌బోర్న్ పిలుస్తోంది.. మళ్ళీ దాయాదుల సమరం..?

చిరకాల ప్రత్యర్థులు ఏ ఫార్మాట్‌లో ఎప్పుడు ఎక్కడ తలపడినా ఆ కిక్కే వేరు..

  • Written By:
  • Updated On - November 10, 2022 / 10:02 AM IST

చిరకాల ప్రత్యర్థులు ఏ ఫార్మాట్‌లో ఎప్పుడు ఎక్కడ తలపడినా ఆ కిక్కే వేరు.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రెండు జట్లూ ఆరంభ మ్యాచ్‌లో తలపడితే..ఈ పోరు ఎప్పటిలానే ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఇప్పుడు మరోసారి భారత్,పాక్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశం కనిపిస్తోంది.. అది కూడా వరల్డ్ ఛాంపియన్‌ను తేల్చే ఫైనల్‌..మరి ఫ్యాన్స్‌ ఆశలు నెరవేరతాయా ? టీ ట్వంటీ అంటేనే క్రికెట్ ఫ్యాన్స్‌కు మజా.. ఇలాంటి ఫార్మేట్‌లో ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాక్ తలపడితే.. అది కూడా టైటిల్ కోసం ఢీకొడితే ఫ్యాన్స్‌కు పండగే..కేవలం రెండు దేశాల అభిమానులే కాదు మొత్తం క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ మ్యాచ్‌ విందు భోజనం లాంటిదే.

ఈ సారి టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో ఒకసారి ఇలాంటి కిక్కును ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్‌కు ఇప్పుడు మరోసారి దాయాదుల సమరాన్ని వీక్షించే అవకాశం ఊరిస్తోంది. అదృష్టవశాత్తూ సెమీస్ చేరిన పాకిస్తాన్ న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకోగా.. ఇప్పుడు రెండో సెమీస్‌లో భారత్, ఇంగ్లాండ్ తలపడబోతున్నాయి. టీమిండియా, ఇంగ్లీష్ టీమ్‌ను నిలువరిస్తే ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు టైటిల్ కోసం పోటీ పడతాయి. అంటే 15 ఏళ్ళ తర్వాత ప్రపంచకప్ ఫైనల్లో భారత్, పాక్‌ తలపడే అవకాశం అభిమానులను ఊరిస్తోంది.

2007 తొలి టీ ట్వంటీ వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్, పాక్ తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఆ పోరులో ధోనీ సారథ్యంలోని టీమిండియా పాక్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఇప్పుడు మరోసారి అలాంటి అవకాశం ఊరిస్తున్న వేళ రోహిత్‌సేన ఇంగ్లాండ్‌ను సెమీస్‌లో నిలువరించి పాక్‌తో ఫైనల్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పాక్‌పై సూపర్ విక్టరీ అందుకున్న టీమిండియా ఫైనల్‌కు చేరితే మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు పాక్ అభిమానులు మాత్రం భారత్‌ ఫైనల్‌కు రాకూడదని కోరుకుంటున్నారు. ఎందుకంటే మెగా టోర్నీల్లో టీమిండియాపై పాక్‌ పేలవ రికార్డు వారిని భయపెడుతోంది. భారత్‌తో మ్యాచ్ అంటే ఒత్తిడికి లోనయ్యే తమ ఆటగాళ్ళు ఫైనల్లో అసలు దానిని అధిగమించలేరని బలంగా నమ్ముతున్నారు. అందుకే రెండో సెమీస్‌లో ఇంగ్లాండ్ గెలవాలని పాక్ ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు. అయితే యావత్ క్రికెట్ ప్రపంచం మాత్రం భారత్‌ ఫైనల్‌కు చేరి పాక్‌పై మళ్ళీ గెలవడం ద్వారా రెండోసారి టీ ట్వంటీ వరల్డ్‌కప్ కైవసం చేసుకోవాలని ఆకాంక్షిస్తోంది.