Asia Cup:అట్లుంటది భారత్,పాక్ మ్యాచ్ అంటే… నిమిషాల్లోనే టిక్కెట్లు ఖతమ్

ప్రపంచ క్రికెట్ లో భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఉండే క్రేజ్ గురించి వేరే చెప్పాలా..సామాన్య అభిమాని నుంచి సెలబ్రిటీ, రాజకీయ ప్రముఖుల వరకూ ఎంతో ఆసక్తి కనబరుస్తారు.

Published By: HashtagU Telugu Desk
Asia Cup

Asia Cup

ప్రపంచ క్రికెట్ లో భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఉండే క్రేజ్ గురించి వేరే చెప్పాలా..సామాన్య అభిమాని నుంచి సెలబ్రిటీ, రాజకీయ ప్రముఖుల వరకూ ఎంతో ఆసక్తి కనబరుస్తారు. ఇక ఫ్యాన్స్ సందడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని నెలల ముందు నుంచే భారత్ , పాక్ పోరుపై చర్చిస్తూ ఉంటారు. చాలా కాలం తర్వాత చిరకాల ప్రత్యర్థులు ఆసియాకప్ వేదికగా తలపడనున్నాయి.

ఈనెల 28న దుబాయ్ వేదికగా ఈ క్రేజీ మ్యాచ్ జరగనుంది. తాజాగా ఈ మ్యాచ్ కు సంబంధించిన టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అమ్మకం మొదలైన నిమిషాల్లోనే టిక్కెట్లు సేల్ అయ్యాయి. దాయాదుల పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ఎప్పటిలాగే మరోసారి ఎగబడ్డారు. టోర్నీ నిర్వహకులు యూఏఈలో అత్యంత ప్రజాదరణ కలిగిన ప్లాటినంలిస్ట్‌ అనే వెబ్‌సైట్‌కు టికెట్ల అమ్మకపు బాధ్యతలు అప్పజెప్పగా.. ఆన్‌లైన్‌ సేల్‌ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలో ఏకంగా 7.5 లక్షల మంది అభిమానులు సైట్‌పై ఒకేసారి దండయాత్ర చేశారు. దీంతో సైట్‌ క్రాష్ అయ్యి టికెట్ల విక్రయానికి కాసేపు అంతరాయం కలిగింది. ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేసేందుకు నిర్వహకులు క్యూ పద్దతిని పాటించారు. అయినప్పనటికీ చాలామంది అభిమానులుకు నిరాశే ఎదురైంది. టికెట్ల అమ్మకాల విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిబంధనలు పాటించలేదని టికెట్‌ అభిమానులు ఆరోపిస్తున్నారు.

టికెట్ల అమ్మకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ లోనూ భారత్, పాక్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కు సంబంధించిన టిక్కెట్లు కూడా నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. చాలా కాలంగా రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగకపోవడంతో కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రం భారత్, పాక్ తలపడుతున్నాయి. చివరిసారిగా భారత్, పాక్ జట్లు గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో పాక్ దే పైచేయిగా నిలిచింది. దీంతో ఆసియాకప్ లో గత ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.

  Last Updated: 16 Aug 2022, 02:05 PM IST