Site icon HashtagU Telugu

India vs Pakistan: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. దుబాయ్ పిచ్ నివేదిక ఇదే!

India vs Pakistan

India vs Pakistan

India vs Pakistan: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025లో అతి పెద్ద మ్యాచ్ నేడు జరగనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ (India vs Pakistan) జట్లు భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడనున్నాయి. ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలనే డిమాండ్లు ఉన్నప్పటికీ అభిమానుల్లో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పిచ్ పరిస్థితులు, జట్ల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

బౌలర్లకు అనుకూలం

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లకు సమంగా అనుకూలిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభంలో కొత్త బంతి స్వింగ్ అవుతుంది. దీంతో ఫాస్ట్ బౌలర్లకు మంచి బౌన్స్ లభించనుంది. దీనిని సద్వినియోగం చేసుకోవడంలో ఏ జట్టు బౌలర్లు రాణిస్తారనేది కీలకం. మ్యాచ్ పురోగమించే కొద్దీ పిచ్ నెమ్మదిగా మారుతుంది. ఇది స్పిన్నర్లకు కలిసొస్తుంది. గతంలో ఇదే మైదానంలో భారత్, యూఏఈ మధ్య జరిగిన మ్యాచ్‌లో మన స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన చేశారు. కుల్దీప్ యాదవ్ కేవలం 7 పరుగులకే 4 వికెట్లు తీయగా, శివమ్ దూబే 3 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ నివేదిక ప్రకారం ఈ మ్యాచ్‌లో అధిక స్కోర్లు నమోదయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. బౌలర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Also Read: PM Modi: నేను శివ భక్తుడిని కాబ‌ట్టే విషమంతా మింగేస్తాను: ప్ర‌ధాని మోదీ

రన్ ఛేజింగ్, రికార్డులు

ఈ మైదానంలో ఇప్పటివరకు అత్యధిక విజయవంతమైన రన్ ఛేజ్ 184 పరుగులు. దీనిని 2022లో శ్రీలంక.. బంగ్లాదేశ్‌పై సాధించింది. అయితే దుబాయ్‌లో అత్యధిక స్కోరు సాధించిన రికార్డు భారత జట్టు పేరిట ఉంది. 2022లో అఫ్ఘానిస్తాన్‌పై భారత్ 212 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇది బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ భారత్ ఈ మైదానంలో ఎంత బలంగా ఉందో తెలియజేస్తుంది.

టాస్ విజేతదే పైచేయి?

టాస్ గెలిచిన జట్టు గెలుపు అవకాశాలు ఈ మైదానంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ జరిగిన 94 మ్యాచ్‌లలో 54 సార్లు టాస్ గెలిచిన జట్టే విజయం సాధించింది. లక్ష్య ఛేదన మొదట బ్యాటింగ్ రెండింటిలోనూ విజయాల సంఖ్య దాదాపు సమానంగా ఉన్నప్పటికీ (లక్ష్య ఛేదనలో 48 విజయాలు, మొదట బ్యాటింగ్‌లో 46 విజయాలు), టాస్ గెలిచి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం కీలకం. ఈ మైదానంలో టాస్ గెలిచిన జట్టు రెండోసారి బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపవచ్చు. ప‌రుగుల వర్షం కురుస్తుందా లేదా వికెట్లు పడతాయా అనేది మ్యాచ్ ప్రారంభమయ్యాకే తెలుస్తుంది. ఏది ఏమైనా, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.