India vs New Zealand 3rd ODI: ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ 41 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. భారత్‌లో పర్యటించి టీమ్ ఇండియాపై ఒక వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ గెలవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 296 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టు తరఫున విరాట్ కోహ్లీ 124 పరుగులతో అద్భుతమైన శతక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు.
Also Read: ఎస్బీఐ ఖాతా ఉన్నవారికి బిగ్ షాక్!
న్యూజిలాండ్ తొలిసారిగా భారత్‌లో వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలో కివీస్ జట్టు భారత్‌కు వచ్చి టీమ్ ఇండియాను ఓడించి సిరీస్ కైవసం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఈ చారిత్రక విజయంలో డారిల్ మిచెల్ అత్యంత కీలక పాత్ర పోషించారు. ఆయన రెండో వన్డేతో పాటు మూడో వన్డేలోనూ భారత్‌పై సెంచరీలు బాదారు. ఇండోర్ వన్డేలో మిచెల్ 137 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, అతనికి తోడుగా గ్లెన్ ఫిలిప్స్ (106 పరుగులు) కూడా సెంచరీతో మెరిశారు. 2024లో భారత్‌లో పర్యటించినప్పుడు టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియాను క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్ జట్టు,ఇప్పుడు వన్డేల్లోనూ అదే తరహా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
విరాట్ ఒంటరి పోరాటం వృథా
338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత జట్టు కేవలం 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంతటి భారీ లక్ష్యం ముందున్నప్పుడు పుంజుకోవడం చాలా కష్టమైన పని. అయితే విరాట్ కోహ్లీ.. నితీష్ కుమార్ రెడ్డితో కలిసి 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను రేసులోకి తెచ్చారు. కానీ ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. రోహిత్ శర్మ కేవలం 11 పరుగులు మాత్రమే చేయగా, గత రెండు మ్యాచ్‌ల్లో అర్ధ సెంచరీలు చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 23 పరుగులకే పరిమితమయ్యారు. శ్రేయస్ అయ్యర్ 3 పరుగులు, కేఎల్ రాహుల్ కేవలం ఒక పరుగు మాత్రమే చేయగలిగారు.
రవీంద్ర జడేజా వరుసగా విఫలమవుతున్నారు. ఈసారి జట్టుకు ఆయన నుంచి పెద్ద ఇన్నింగ్స్ అవసరమైనప్పటికీ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. అయితే హర్షిత్ రాణా 52 పరుగుల ఇన్నింగ్స్‌తో టీమ్ ఇండియాను విజయానికి చేరువ చేసే ప్రయత్నం చేశారు. ఆయన విరాట్ కోహ్లీతో కలిసి 99 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హర్షిత్ అవుట్ అయిన తర్వాత భారత జట్టు ఆశలన్నీ విరాట్ కోహ్లీపైనే నిలిచాయి. కానీ ఆయన కూడా 46వ ఓవర్‌లో 124 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యారు. దీంతో భారత్ జట్టుకు ఓటమి తప్పలేదు.
