Site icon HashtagU Telugu

India vs Ireland: మ‌హిళ‌ల వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో అతిపెద్ద విజ‌యాన్ని సాధించిన టీమిండియా!

India vs Ireland

India vs Ireland

India vs Ireland: వన్డే క్రికెట్ చరిత్రలో భారత మహిళా క్రికెట్ జట్టు అతిపెద్ద విజయాన్ని సాధించింది. ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా (India vs Ireland) 304 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి స్కోరు బోర్డులో 435 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఐర్లాండ్ జట్టు మొత్తం 131 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌కు దిగిన ప్రతీకా రావల్ 154 పరుగులు చేయగా, కెప్టెన్ స్మృతి మంధాన 135 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. బౌలింగ్‌లో దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టింది. ఈ విజయంతో భారత జట్టు 3-0తో సిరీస్‌ని కైవసం చేసుకుంది.

భారత జట్టు రికార్డు విజయం

టీమ్ ఇండియా ఇచ్చిన 436 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐర్లాండ్ జట్టు మొత్తం 131 పరుగులకే కుప్పకూలింది. ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్లలో ఏడుగురు రెండంకెల స్కోరును కూడా దాటలేకపోయారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవలేకపోయారు. బౌలింగ్‌లో భారత్‌ తరఫున దీప్తి శర్మ 8.4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, తనూజ రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో భారత జట్టు ఐర్లాండ్‌ను ఓడించి 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Also Read: Minister Sridhar Babu: కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయాభివృద్ధికి సహకరించండి: మంత్రి శ్రీధర్ బాబు

మంధాన-ప్రతీక విధ్వంసం సృష్టించారు

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ప్రతీకా రావల్, కెప్టెన్ స్మృతి మంధాన శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 233 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రతీక 129 బంతులు ఎదుర్కొని 154 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. కాగా.. మంధాన కేవలం 70 బంతుల్లోనే సెంచరీ సాధించింది. భారత కెప్టెన్ 80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 135 పరుగులతో బలమైన ఇన్నింగ్స్ ఆడింది. అదే సమయంలో రిచా ఘోష్ కూడా బ్యాట్‌తో రాణించింది. 42 బంతుల్లో 59 పరుగులతో వేగ‌వంత‌మైన ఇన్నింగ్స్ ఆడింది.

ప్రతీక, మంధానల బ్యాటింగ్ కారణంగా భారత జట్టు వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 435 పరుగులు చేసిన టీమిండియా స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించింది. పురుషుల జట్టు 14 ఏళ్ల రికార్డును కూడా టీమిండియా మ‌హిళ‌లు బద్దలు కొట్టారు. 2011లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పురుషుల జట్టు 5 వికెట్లు కోల్పోయి మొత్తం 418 పరుగులు చేసింది. వన్డేల్లో భారత జట్టు 400 పరుగుల మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి.