India vs England: మాంచెస్టర్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు సాధించి, భారత్‌పై (India vs England) 186 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఆట ముగిసే సమయానికి కెప్టెన్ బెన్ స్టోక్స్ 77 పరుగులతో లియామ్ డాసన్ (21) క్రీజ్‌లో ఉన్నారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ హైలైట్స్
మూడో రోజు ఇంగ్లాండ్ తమ ఓవర్‌నైట్ స్కోర్ 225/2 నుంచి ఆటను ప్రారంభించింది. జో రూట్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో 150 పరుగులు సాధించి, పలు రికార్డులను సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్, జాక్ కాలిస్, రికీ పాంటింగ్‌లను అధిగమించి రెండో స్థానానికి చేరుకున్నాడు. అంతేకాకుండా భారత్‌పై టెస్ట్‌లలో అత్యధిక సెంచరీలు (12) సాధించిన బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు. రూట్ 150 పరుగుల వద్ద స్టంప్ ఔట్ అయ్యాడు.
Also Read: AP Government: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ!
కీలక భాగస్వామ్యాలు
మొదటి సెషన్‌లో జో రూట్- ఆలీ పోప్ (71 పరుగులు) కలిసి 144 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత బౌలర్లకు గట్టి పోటీనిచ్చారు. ఆలీ పోప్ ఔటైన తర్వాత కూడా జో రూట్- బెన్ స్టోక్స్ కలిసి మరో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత జట్టుకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. బెన్ స్టోక్స్ రిటైర్డ్ హర్ట్ అయి పెవిలియన్‌కు వెళ్లినా కీలక వికెట్లు పడుతున్న సమయంలో మళ్లీ క్రీజ్‌లోకి వచ్చి దృఢంగా నిలబడ్డాడు.
భారత బౌలర్లు ఈ రోజు నిరాశపరిచారు. జస్ప్రీత్ బుమ్రా లయ తప్పినట్లు కనిపించగా, అతని బౌలింగ్ వేగంలోనూ తగ్గుదల నమోదైంది. అరంగేట్ర ఆటగాడు అంశుల్ కంబోజ్ కూడా ప్రభావం చూపలేకపోయాడు. టీమిండియా తరపున రవీంద్ర జడేజా 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా, అంశుల్ కంబోజ్, మహ్మద్ సిరాజ్ తలో వికెట్ తీశారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 186 పరుగుల భారీ ఆధిక్యంతో పటిష్ట స్థితిలో ఉంది. నాలుగో రోజు కనీసం 250 పరుగుల ఆధిక్యాన్ని సాధించి, భారత్‌పై మరింత ఒత్తిడి పెంచాలని చూస్తోంది. భారత్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే వికెట్లు కాపాడుకోవాల్సిందే..!