Site icon HashtagU Telugu

IND vs BAN T20 series: గ్వాలియర్ లో పరుగుల వరదే తొలి టీ ట్వంటీ పిచ్ రిపోర్ట్ ఇదే

Ind Vs Ban T20 Series

Ind Vs Ban T20 Series

IND vs BAN T20 series: భారత్,బంగ్లాదేశ్ (IND vs BAN) టీ ట్వంటీ సిరీస్ కు ఆదివారం నుంచే తెరలేవనుంది. గ్వాలియర్ వేదికగా తొలి మ్యాచ్ జరగబోతోంది. ఇరు జట్లు ఇప్పటికే నెట్స్ లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ యువ జట్టు ఘనవిజయంతో సిరీస్ ఆరంభించాలని భావిస్తోంది.

ఇదిలా ఉంటే గ్వాలియర్ లో 14 ఏళ్ళ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరగడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. చివరిసారిగా 2010లో భారత్, సౌతాఫ్రికా మధ్య ఇక్కడ వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. అయితే గ్వాలియర్ స్టేడియంలో ఇప్పటి వరకూ అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్ జరగలేదు. ఇటీవల మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లను ఇక్కడ నిర్వహించారు.

సాధారణంగా ఈ గ్రౌండ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఆదివారం మ్యాచ్ లో కూడా పిచ్ (Pitch Report) బ్యాటింగ్ కు సహకరిస్తుందన్న అంచనాల నేపథ్యంలో భారీస్కోర్లు నమోదవడం ఖాయం. మధ్యప్రదేశ్ టీ ట్వంటీ లీగ్ లో నాలుగు సార్లు 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. అలాగే ఛేజింగ్ టీమ్ కే ఇక్కడ విజయావకాశాలు ఎక్కువ. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు నాలుగు సార్లు గెలిస్తే ఛేజింగ్ టీమ్స్ 8 మ్యాచ్ లలో గెలిచాయి. కాగా భారత జట్టులో పలువురు హిట్టర్లు ఉండడంతో హైస్కోరింగ్ ఎన్ కౌంటర్ ఫ్యాన్స్ ను అలరించడం ఖాయమని చెప్పొచ్చు. మరోవైపు గ్వాలియర్ స్టేడియం దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు నిరసనగా హిందూ మహాసభ ప్రొటెస్ట్ చేసే అవకాశం ఉండడంతో సెక్షన్ 163ని విధించారు. మ్యాచ్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా భారీగా భద్రతా బలగాలను మోహరించారు. అటు ఆటగాళ్ళు బస చేసిన హోటల్ దగ్గర కూడా సెక్యూరిటీని పెంచారు.

Also Read: CM Revanth : రేవంత్ రెడ్డి ఫై ఏపీ మంత్రి ప్రశంసలు