Site icon HashtagU Telugu

India vs Australia: సిడ్నీ టెస్టులో పంత్‌కు గాయం.. డ‌కౌట్ అయిన నితీశ్, ప‌ట్టు సాధిస్తున్న ఆస్ట్రేలియా

Rishabh Pant

Rishabh Pant

India vs Australia: భారత్-ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ సిడ్నీ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా మరోసారి కష్టాల్లో పడింది. తొలి రోజు 4 వికెట్ల పతనం తర్వాత భారత ఇన్నింగ్స్ తడబడింది. ఆ తర్వాత అభిమానుల చూపు రిషబ్ పంత్ పైనే పడింది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పంత్ గాయపడ్డాడు. ఆ తర్వాత పంత్ కట్టుతో ఆడాల్సి వచ్చింది.

పంత్ గాయం ఎంత తీవ్రంగా ఉంది?

గాయం అయిన వెంటనే ఫిజియో మైదానానికి రావాల్సి వచ్చింది. వాస్తవానికి మిచెల్ స్టార్క్ నుండి వచ్చిన ఒక వేగవంతమైన బంతి రిషబ్ పంత్ మోచేతి పైన బంతి త‌గిలింది. దీంతో ఆ భాగంలో మ‌చ్చ‌లాగా ఏర్ప‌డి వాపు వ‌చ్చింది. వెంట‌నే భార‌త ఫిజియో చేసి చికిత్స అందించాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే పెద్ద గాయ‌మైనా స‌రే పంత్ దాన్ని లెక్క‌చేయ‌కుండా బ్యాటింగ్ చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో పంత్‌కు స్టార్క్ బౌలింగ్‌లో ఒక‌సారి హెల్మెట్‌కు బంతి త‌గిలింది. అయితే మ్యాచ్ తర్వాత అతని గాయం ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఒక అంచనాకు రానున్నారు.

Also Read: SSA Employees Protest : సమగ్ర శిక్షా ఉద్యోగులపై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం?

అంతే కాదు కొన్ని బంతుల తర్వాత స్టార్క్ వేసిన బంతుల్లో ఒకటి పంత్ హెల్మెట్‌కు తగిలింది. ఈ బంతి వేగం గంటకు దాదాపు 144కి.మీ. దీని తర్వాత మ్యాచ్‌ను కొద్దిసేపు నిలిపివేసి ఫిజియో వచ్చి పంత్‌ను తనిఖీ చేయగా అతని హెల్మెట్‌ను తనిఖీ చేశారు. ఈ సమయంలో స్టార్క్ కూడా పంత్ పరిస్థితి గురించి అడగడం కనిపించింది.

వెంట‌వెంట‌నే రెండు వికెట్ల కోల్పోయిన భార‌త్

ఇక‌పోతే మొద‌టి ఇన్నింగ్స్‌లో 72 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియాకు మ‌రోసారి షాక్ త‌గిలింది. మంచి ఫామ్‌లో ఉన్న పంత్ ఔట్ కావ‌డంతో టీమిండియా క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. జ‌ట్టు 120 ప‌రుగుల స్కోర్ వ‌ద్ద పంత్ ఐదో వికెట్ రూపంలో ఔట్ అయ్యాడు. పంత్ ఈ మ్యాచ్‌లో 40 ప‌రుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వ‌చ్చిన సెంచ‌రీ హీరో, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఖాతా తెర‌వ‌కుండానే ఔట‌య్యాడు. దీంతో భార‌త్ మ‌రోసారి క‌ష్టాల్లో ప‌డింది. ఈ వార్త రాసే స‌మ‌యానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 121 ప‌రుగులు చేసింది. క్రీజులో ర‌వీంద్ర జ‌డేజా (15), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (0) ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో బోలాండ్ నాలుగు వికెట్లు తీయ‌గా.. లియాన్‌, స్టార్క్ చెరో వికెట్ తీశారు.