Site icon HashtagU Telugu

India vs Australia: మెగా టోర్నీకి ముందు బిగ్ ఫైట్‌.. రేపటి నుంచే భారత్, ఆసీస్ వన్డే సిరీస్‌

India vs Australia

Compressjpeg.online 1280x720 Image 11zon

India vs Australia: క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే వన్డే ప్రపంచకప్‌ మరో రెండు వారాల్లో ఆరంభం కానుంది. దీని కంటే ముందు టీమిండియా ఫ్యాన్స్‌కు మంచి కిక్కిచ్చే సిరీస్ జరగబోతోంది. వరల్డ్ క్రికెట్‌లో రెండు అత్యుత్తమ జట్లుగా ఉన్న భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య వన్డే సిరీస్ శుక్రవారం నుంచే మొదలు కాబోతోంది. ప్రపంచకప్‌కు ముందు జట్టు కూర్పు, తమ బలాబలాలను పరీక్షించుకునేందుకు ఈ సిరీస్ చివరి అవకాశం.. ఆసియాకప్ గెలిచి జోష్‌లో ఉన్న టీమిండియా అదే ఫామ్‌ కంటిన్యూ చేయాలని భావిస్తోంది. అయితే తీరిక లేని షెడ్యూల్‌తో తొలి రెండు వన్డేలకు సీనియర్ ప్లేయర్స్ దూరం కానున్నారు.

కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వడంతో కేఎల్ రాహుల్ భారత్‌ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. అలాగే కోహ్లీ, పాండ్యా, కుల్దీప్ యాదవ్‌లకు కూడా విశ్రాంతినిచ్చారు. దీంతో గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్‌పైనే అందరి చూపు ఉంది. ఈ సిరీస్‌లో అయ్యర్ అదరగొడితే వరల్డ్‌కప్‌కు ముందు భారత్‌ బలం మరింత పెరిగినట్టే. ఇషాన్ కిషన్, తిలక్‌ వర్మతో పాటు వన్డేల్లో తరచుగా విఫలమవుతున్న సూర్యకుమార్ యాదవ్‌లపై అంచనాలున్నాయి.

Also Read: Hasaranga Injury: వరల్డ్ కప్ కు ముందు శ్రీలంకకు భారీ షాక్ తగలనుందా..? కీలక ఆటగాడికి మరోసారి గాయం..?

ముఖ్యంగా తెలుగు తేజం తిలక్‌ వర్మ సొంతగడ్డపై చెలరేగితే రానున్న రోజుల్లో వన్డే ఫార్మాట్‌లోనూ కీ ప్లేయర్‌గా మారే అవకాశముంటుంది. ఇదిలా ఉంటే బౌలింగ్‌లో మాత్రం పెద్ద మార్పులు చేయలేదు. పేస్ ఎటాక్‌ను బూమ్రా లీడ్ చేయనుండగా.. సూపర్ ఫామ్‌లో ఉన్న సిరాజ్, శార్థూల్ ఠాకూర్‌ తోడుగా ఉన్నారు. స్పిన్ విభాగంలో చాలా కాలం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్‌పైనే అందరి దృష్టీ ఉంది. ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా తన ఫామ్ కంటిన్యూ చేస్తే కంగారూలకు కష్టాలు తప్పవు.

మరోవైపు ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడే విషయంలో ఆసీస్‌కు ఎటువంటి ఇబ్బందీ లేదు. ఎందుకంటే ఐపీఎల్ ఆడుతూ భారత్‌ పిచ్‌లపై పూర్తి అవగాహన ఉన్న కంగారూలు సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ చేజార్చుకున్నా ఆసీస్‌ కూడా ఫామ్‌లోనే ఉంది. ఆ జట్టు కీలక ఆటగాళ్ళు అందరూ నిలకడగా రాణిస్తుండడం అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు. పాట్ కమ్మిన్స్‌ సారథ్యంలోని ఆసీస్ జట్టులో బౌలింగ్‌ అత్యంత బలంగా ఉంది. సీన్ ఎబోట్, కామెరూన్ గ్రీన్, హ్యాజిల్‌వుడ్‌లు ఆసీస్‌కు కీలకం. అలాగే బ్యాటింగ్‌లో డేవిడ్ వార్నర్, స్మిత్, లబూషేన్, మాక్స్‌వెల్‌ , స్టోయినిస్‌ కీలకం కానున్నారు. మొత్తం మీద ఇరు జట్లలోనూ స్టార్ ప్లేయర్స్ , ప్రస్తుత ఫామ్, ప్రపంచకప్‌ ముంగిట కీలకమైన సిరీస్ కావడంతో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.