Site icon HashtagU Telugu

India vs Australia: స్పిన్నర్లు మాకూ ఉన్నారు: కమ్మిన్స్‌

File7osbeqx6g5516l2zrbr5 1187883 1675520461 1 1187883 1675525692

File7osbeqx6g5516l2zrbr5 1187883 1675520461 1 1187883 1675525692

India vs Australia: విదేశీ పిచ్‌లు పేస్‌కు అనుకూలిస్తే… ఉపఖండం పిచ్‌లు స్పిన్నర్లకు సహకరిస్తాయి… సొంత పిచ్‌లపై ఆతిథ్య జట్టుదే పై చేయిగా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే పర్యటనకు వెళ్ళినప్పుడు కొన్ని రోజుల ముందే అక్కడి పిచ్‌లకు అలవాటు పడేందుకు దానికి తగ్గట్టుగానే సిద్ధమవుతాయి. తాజాగా భారత్ టూర్ కోసం వచ్చిన ఆస్ట్రేలియా ఇక్కడి పిచ్‌లపై కామెంట్స్ చేస్తూ మైండ్ గేమ్స్ ఆడుతోంది. అయితే స్పిన్ సవాల్‌కు తాము సిద్ధంగా ఉన్నామని ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ వ్యాఖ్యానించాడు. తమ జట్టులోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారని, భిన్నమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయన్నాడు. ఈ సిరీస్‌లో నాథన్‌ లయన్‌ తమ ప్రధానాస్త్రంగా చెప్పుకొచ్చాడు. తమ జట్టులో ఆఫ్‌స్పిన్నర్, లెగ్‌స్పిన్నర్, లెఫ్టార్మ్‌ పేసర్‌… ఇలా భిన్నమైన బౌలర్లు అందుబాటులో ఉన్నారనీ, పరిస్థితులను బట్టి 20 వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్న బౌలింగ్‌ బృందాన్నే ఎంచుకున్నట్టు చెప్పుకొచ్చాడు. నాగపూర్‌లో తొలి టెస్టు సమయానికే స్పష్టత వస్తుందన్న కమ్మిన్స్ తమ స్పిన్నర్లపై మేనేజ్‌మెంట్‌కు గట్టి నమ్మకం ఉందన్నాడు.

అయితే స్పిన్‌పై చర్చలో తమ పేస్‌ బౌలర్ల పదును గురించి ఎవరూ చర్చించడం లేదని కమిన్స్‌ వ్యాఖ్యానించాడు. అన్ని పరిస్థితుల్లోనూ సత్తా చాటగల పేస్‌ బౌలర్లు మాకు ఉన్నారన్నాడు. పేస్‌కు పెద్దగా సహకరించని సిడ్నీ పిచ్‌లపై కూడా వారు చెలరేగిన విషయాన్ని గుర్తు చేశాడు. గత భారత పర్యటనలో రాంచీ టెస్టులో తాను మంచి ప్రదర్శన కనబరిచానని చెప్పాడు. ఇదిలా ఉంటే భారత్‌లో స్పిన్‌ బౌలింగ్‌ ప్రభావం గురించే అంతా మాట్లాడుతున్నారని, అయితే రివర్స్‌ స్వింగ్‌ కూడా తమను ఇబ్బంది పెట్టవచ్చని ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ అభిప్రాయపడ్డాడు. 2018లో ఆసీస్‌ ఎ తరఫున ఇక్కడ ఆడినప్పుడు ఇలాంటి పరిస్థితే ఎదురైందన్నాడు. తాము స్పిన్ కోసం సిద్ధమైతే భారత పేసర్లు రివర్స్‌ స్వింగ్‌తో తమను పడగొట్టారని గుర్తు చేసుకున్నాడు. భారత్,ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి మొదలుకానుంది. ఇప్పటికే ఇరు జట్లూ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.