India vs Australia: హ్యాట్రిక్ కొడతారా..!

వరుసగా రెండు టెస్టుల్లోనూ ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా ఇప్పుడు హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసింది.

వరుసగా రెండు టెస్టుల్లోనూ ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా (Team India) ఇప్పుడు హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసింది. ఇండోర్ వేదికగా రేపటి నుంచి ఆరంభం కానున్న టెస్టులోనూ గెలిస్తే సిరీస్ గెలవడంతో పాటు వరుసగా మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంటుంది. మరోవైపు వరుస ఓటములకు తోడు కీలక ఆటగాళ్ళ గాయాలు వెంటాడుతున్న వేళ ఆసీస్‌ ఒత్తిడిలో కనిపిస్తోంది.

సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్న టీమిండియా (Team India) ఇప్పటికే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచింది. గత రెండు పర్యాయాలు ఈ ట్రోఫీ భారతే గెలవడంతో మరోసారి దానిని నిలబెట్టుకుంది. ఇప్పుడు సిరీస్‌ను స్వీప్ చేసే క్రమంలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. ప్రస్తుత ఫామ్, గత రికార్డుల పరంగా ఈ మ్యాచ్‌లోనూ భారతే ఫేవరెట్‌. సిరీస్ ఆరంభం నుంచీ రోహిత్‌సేన స్పష్టమైన ఆధిపత్యం కనబరుస్తోంది. స్పిన్ వ్యూహంతో కంగారూలను చిత్తు చేసి 2-0 ఆధిక్యంలో నిలిచిన టీమిండియాను నిలువరించడం ఆసీస్‌కు అంత సులభం కాదు. అయితే తుది జట్టు కూర్పు భారత్‌కు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వైఫల్యాల బాట వీడని కెఎల్ రాహుల్‌ను కొనసాగిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ శుభ్‌మన్‌ గిల్‌కు చోటు కల్పిస్తారా అనేది ఆసక్తికరం. ఇండోర్ పిచ్‌ పేస్‌తో పాటు స్పిన్‌కూ అనుకూలిస్తుందన్న అంచనా నేపథ్యంలో కాంబినేషన్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి.

మరోవైపు మూడో టెస్టులో గెలిచి సిరీస్ డ్రా చేసుకునే ఆశలు నిలుపుకోవాలని ఆస్ట్రేలియా పట్టుదలగా ఉంది. అయితే కీలక ఆటగాళ్ళు గాయాలతో అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది. వ్యక్తిగత కారణాలతో ప్యాట్ కమ్మిన్స్‌ దూరమవడంతో స్టీవ్ స్మిత్‌ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు అందుకోనున్నాడు. మిఛెల్ స్టార్క్ ఆడడంపై సస్పెన్స్ కొనసాగుతుండగా.. కామెరూన్ గ్రీన్ జట్టులోకి రావడం ఖాయమైంది. ఇండోర్ పిచ్‌ పేసర్లకు కూడా అనుకూలిస్తుందన్న అంచనాలు ఆసీస్‌కు కాస్త ఊరటనిస్తున్నాయి. అయితే స్పిన్‌ను ఎదుర్కోవడంలో కంగారూల బలహీనత వరుస ఓటములకు కారణంగా చెప్పొచ్చు. స్పిన్‌ పిచ్‌లకు పూర్తిగా సన్నద్ధమయ్యే భారత్‌కు వచ్చామంటూ ఆసీస్ క్రికెటర్లు చెప్పినప్పటకీ.. వారి ప్రిపరేషన్ మాత్రం ఆ స్థాయిలో లేదని తేలిపోయింది. మరి సిరీస్‌ చేజారకుండా ఉండాలంటే గెలవాల్సిన మూడో టెస్టులో కంగారూలు ఎంతవరకూ రాణిస్తారనేది చూడాలి. కాగా ఇండోర్‌ టెస్టులోనూ భారత్ గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది.

Also Read:  Wankhede Stadium: వాంఖేడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ విగ్రహం