Site icon HashtagU Telugu

Australia vs India in Indore: ఇండోర్‌లో తొలిరోజు ఆసీస్‌దే

India Vs Australia On First Day In Indore

India Vs Australia On First Day In Indore

ఇండోర్ (Indore) టెస్టులో తొలిరోజు ఆస్ట్రేలియాదే పై చేయిగా నిలిచింది. సిరీస్ చేజారకుండా డ్రా చేసుకునేందుకు ఇదే చివరి అవకాశం కావడంతో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్న ఆసీస్ (Australia) తొలిరోజు భారత్‌ను కట్టడి చేసింది. కేవలం 109 పరుగులకే కుప్పకూల్చింది. స్పిన్‌ పిచ్‌పై తొలి రెండు సెషన్లలోనే భారత్ ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాను ఆసీస్ స్పిన్నర్లు 109 పరుగులకే పరిమితం చేశారు. ప్రధాన బ్యాటర్లలో ఏ ఒక్కరూ క్రీజులో నిలవలేదు. ఊహించినట్టుగానే వైఫల్యాల బాటలో ఉన్న కెఎల్ రాహుల్‌ను తప్పించి గిల్‌ను తీసుకున్నారు. అయితే గిల్‌, రోహిత్‌, పుజారా, శ్రేయాస్ అయ్యర్ , జడేజాతో పాటు మిగిలిన వారంతా నిరాశపరిచారు. రోహిత్‌శర్మ 12 పరుగులకే స్టంపౌటవగా..గిల్ 21, పుజారా 1 పరుగుకే పరిమితమయ్యారు. కోహ్లీ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు జడేజా కూడా వెనుదిరిగాడు. దీంతో భారత్ 45 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. లంచ్‌ బ్రేక్‌కు ముందు కోహ్లీ, శ్రీకర్ భరత్ కూడా ఔటవడంతో కనీసం 100 రన్స్ అయినా చేస్తుందా అనిపించింది. లంచ్ తర్వాత ఉమేశ్ యాదవ్ ఎటాకింగ్ బ్యాటింగ్ చేయడంతో స్కోర్ 100 దాటగలిగింది. ఆసీస్ పేసర్ల కేవలం ఏడు ఓవర్లే వేయగా.. భారత్‌ (India) ఇన్నింగ్స్‌ 33 ఓవర్లలో ముగిసింది. కోహ్లీ చేసిన 22 పరుగులే భారత్‌ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్‌. ఆసీస్ బౌలర్లలో కునేమన్‌ 5 , ల్యాన్ 3 , మర్ఫీ 1 వికెట్ పడగొట్టారు.

తర్వాత ఆసీస్ కూడా ఆరంభంలోనే ఓపెనర్ ట్రావిస్ హెడ్ వికెట్ చేజార్చుకుంది. అయితే మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా స లబూషేన్ నిలకడగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 96 పరుగులు జోడించారు. ఖవాజా హాఫ్ సెంచరీ సాధించగా.. లబూషేన్ 31 రన్స్ చేశాడు. ఆసీస్‌ ఆధిక్యం మరింత పెరిగే దశలో జడేజా మరోసారి తన స్పిన్‌ మ్యాజిక్‌ చూపించాడు. చివరి సెషన్‌ కాసేపట్లో ముగుస్తుందనగా.. ఖవాజా 60 , స్మిత్ 26 రన్స్‌కు ఔట్ చేశాడు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లకు 156 పరుగులు చేసింది. హ్యాండ్స్‌కోంబ్ 7 , కామెరూన్ గ్రీన్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో జడేజాకే 4 వికెట్లు దక్కాయి. ప్రస్తుతం ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో ఉండగా.. రెండోరోజు ఎంత త్వరగా ఆ జట్టును ఆలౌట్ చేస్తారనే దానిపైనే మ్యాచ్‌లో భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. స్పిన్ పిచ్ కావడంతో ఆధిక్యం 100 దాటితే రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటర్లు పట్టుదలగా ఆడాల్సి ఉంటుంది.

Also Read:  India vs Australia: హ్యాట్రిక్ కొడతారా..!