India vs Australia 2022: ఆసీస్‌కు షాక్‌.. భారత్‌ టూర్ ఆ స్టార్ ప్లేయర్స్ ఔట్‌..!!

టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు ముందు భారత గడ్డపై సిరీస్ గెలవాలనుకుంటున్న ఆస్ట్రేలియా గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Published By: HashtagU Telugu Desk
T20 Iccrankings

T20 Iccrankings

టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు ముందు భారత గడ్డపై సిరీస్ గెలవాలనుకుంటున్న ఆస్ట్రేలియా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వరుస సిరీస్‌లతో బిజీగా ఉన్న ఆస్ట్రేలియా ముగ్గురు స్టార్ ప్లేయర్స్ గాయాల బారిన పడ్డారు. మిషెల్ మార్ష్, మిషెల్ స్టార్క్, స్టోయినిస్ గాయం కారణంగా భారత్‌లో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు దూరమయ్యారు. స్టార్క్ మోకాలి గాయంతో బాధపడుతుంటగా.. మిషెల్ మార్ష్, స్టోయినిస్ చీలమండ, పక్క సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గాయం తీవ్రత తెలియకున్నా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముగ్గురినీ ఆసీస్ బోర్డు తప్పించింది.

వచ్చే నెలలో టీ ట్వంటీ ప్రపంచకప్ జరగనుండడంతో ఎటువంటి రిస్క్ తీసుకోదలచుకోలేదని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. గాయపడిన ఈ ముగ్గురు ఆటగాళ్ల స్థానంలో నాథన్ ఇల్లీస్, డానియల్ సామ్స్, సీన్ అబాట్‌కు చోటు దక్కింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా సొంతగడ్డపై జరగనున్న టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ను మళ్ళీ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. దీనిలో భాగంగానే ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు విశ్రాంతినిచ్చింది.

ఇప్పుడు ముగ్గురు ఆటగాళ్ళ గాయాలు చిన్నవే అయినా రిస్క్ తీసుకోకుండా భారత్‌ పర్యటన నుంచి తప్పించింది. జింబాబ్వేతో వన్డే సిరీస్‌ సందర్భంగా ఈ ముగ్గురూ గాయాల పాలైనట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే భారత్‌ పర్యటనలో ఆస్ట్రేలియా మూడు టీ ట్వంటీలు ఆడనుంది. తొలి మ్యాచ్ సెప్టెంబరు 20న మొహాలీలోనూ , రెండో టీ ట్వంటీ నాగపూర్‌లోనూ జరగనుంది. ఇక సెప్టెంబర్ 25న జరిగే మూడో మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది.

  Last Updated: 14 Sep 2022, 10:31 PM IST