Site icon HashtagU Telugu

India vs Australia: వ‌ర్షం ఎఫెక్ట్‌.. భార‌త్- ఆస్ట్రేలియా తొలి టీ20 ర‌ద్దు!

India vs Australia

India vs Australia

India vs Australia: కాన్‌బెర్రాలో వర్షం క్రికెట్ అభిమానుల మనసులను ముక్కలు చేసింది. భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ రద్దైంది. వర్షం కారణంగా కేవలం 58 బంతుల ఆట మాత్రమే సాధ్యమైంది. ఈ సమయంలో టీమ్ ఇండియా ఒక వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్న తరుణంలో 10వ ఓవర్‌లో ఉరుములు మెరిసి భారీ వర్షం మొదలైంది. ఆ తర్వాత దాదాపు ఒకటిన్నర గంటపాటు వర్షం తగ్గుముఖం పట్టడం కోసం ఎదురుచూశారు. కానీ చివరకు మ్యాచ్‌ను రద్దు చేసినట్లు ప్రకటించారు.

కాన్‌బెర్రా టీ20 మ్యాచ్‌కు ముందు నుంచే వర్షం వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే మ్యాచ్ నిర్ణీత సమయానికే ప్రారంభమైంది. కానీ ఆరో ఓవర్‌లో వర్షం అంతరాయం కలిగించడంతో ఆట దాదాపు అరగంట పాటు నిలిచిపోయింది. దీని తర్వాత మ్యాచ్‌ను 18-18 ఓవర్లకు కుదించారు. వర్షం తర్వాత ఆట మళ్లీ ప్రారంభమైనప్పుడు సూర్య, గిల్ మెరుపు బ్యాటింగ్ ప్రారంభించారు. ఆస్ట్రేలియా బౌలర్లను ఇద్దరూ దంచి కొట్టారు. కానీ 10వ ఓవర్‌లో మళ్లీ ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. దీని తర్వాత మ్యాచ్ మళ్లీ మొదలు కాలేదు.

వర్షం ప్రారంభమైనప్పుడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 24 బంతుల్లో 39 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ఆయన 3 ఫోర్లు, రెండు సిక్స్‌లు కొట్టారు. శుభ్‌మన్ గిల్ 20 బంతుల్లో 37 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. గిల్ 4 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టారు. భారత్ కేవలం 9.4 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.

Also Read: Nellore Collector: నెల్లూరు కలెక్టర్ ప్రేమకు ఫిదా.. తుఫాన్ బాధితులకు అండగా హిమాన్షు శుక్లా!

ఆసీస్ బౌలర్లకు చుక్కలు

ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత బ్యాట్స్‌మెన్ అతని నిర్ణయాన్ని తప్పు అని నిరూపించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ 14 బంతుల్లో 19 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి 4 ఫోర్లు వచ్చాయి. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో అభిషేక్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 24 బంతుల్లో 39, శుభ్‌మన్ గిల్ 20 బంతుల్లో 37 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. గిల్ 4 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టగా, సూర్య 3 ఫోర్లు, రెండు సిక్స్‌లు కొట్టారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 3 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చాడు. మ్యాథ్యూ కుహ్నెమన్ 2 ఓవర్లలో 22, మార్కస్ స్టోయినిస్ 1 ఓవర్‌లో 10, నాథన్ ఎల్లిస్ 1.4 ఓవర్లలో 25 పరుగులు సమర్పించుకున్నారు. జేవియర్ బార్ట్‌లెట్ 2 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చాడు.

 

Exit mobile version