India vs Pakistan: అండర్-19 ఆసియా కప్ 2025 విజేతగా పాకిస్థాన్ నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పాక్ బౌలర్ల ముందు చేతులెత్తేశారు. 348 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. ముందుగా భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోగా, ఆ తర్వాత బ్యాటర్లు కూడా ఘోరంగా విఫలమయ్యారు. అయితే ఈ ఓటమికి కెప్టెన్ ఆయుష్ మ్హత్రే తీసుకున్న ఒక నిర్ణయమే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
కెప్టెన్ ఆయుష్ మ్హత్రే చేసిన ఆ తప్పు ఏంటి?
ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ ఆయుష్ మ్హత్రే మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. సాధారణంగా ఫైనల్ వంటి ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లలో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించాలని చూస్తుంది. కానీ ఆయుష్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత్ బౌలింగ్ ఎంచుకోవడంతో పాక్ కెప్టెన్ కూడా చాలా సంతోషంగా కనిపించాడు.
Also Read: 2026లో జరగబోయే 10 ప్రధాన క్రీడా టోర్నమెంట్లు ఇవే!
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత ఓవర్లలో 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఫలితంగా కేవలం 156 పరుగులకే టీమ్ ఇండియా ఆలౌట్ అయింది. జట్టులోని ఆరుగురు బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. భారత్ తరపున బౌలర్ దీపేష్ అత్యధికంగా 36 పరుగులు చేయడం గమనార్హం.
కుప్పకూలిన భారత బ్యాటింగ్ ఆర్డర్
348 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ మ్హత్రే కేవలం 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 26 పరుగులు చేసినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో భారత్ 156 పరుగుల వద్దే చాపచుట్టేసింది. ఆయుష్ టాస్ గెలిచినప్పుడు మొదట బ్యాటింగ్ తీసుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
