Site icon HashtagU Telugu

India U19: అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్

Indian Women

Indian Women

సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల అండర్ 19 ప్రపంచ కప్ లో భారత్ దుమ్ము రేపుతోంది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ ఫైనల్ కు దూసుకెళ్లింది. ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ కివీస్ భారత్ కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయింది. మొదట బ్యాటింగ్ కు దిగిన కివీస్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేసింది. జార్జియా ప్లిమ్మర్ 35, ఇసాబెల్లా గేజ్ 26 మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో పర్షావి చోప్రా మూడు వికెట్లు తీయగా.. టిటాస్ సధు, మన్నత్ కశ్యప్, అర్చనా దేవి, షెఫాలీ వర్మ తలో వికెట్ తీసారు.

తర్వాత లక్ష్య చేధనలో టీమిండియా దూకుడుగా ఆడింది. టార్గెట్ ను 14.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి చేదించింది. షెఫాలీ వర్మ(10) విఫలమైనా.. శ్వేతా సెహ్రావత్ విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టింది. సౌమ్య తివారి‌తో రెండో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. శ్వేతా సెహ్రావత్ 45 బంతుల్లో 10 ఫోర్లతో 61 నాటౌట్ గా నిలిచింది. ఇంగ్లండ్‌ , ఆస్ట్రేలియా మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్‌ విజేతతో జనవరి 29న భారత మహిళల జట్టు ఫైనల్‌ లో తలపడుతుంది. ఈ టోర్నీలో భారత్ కేవలం ఆస్ట్రేలియా చేతిలో మాత్రమే పరాజయం పాలైంది.