4th Test Ind Vs Aus: ఆస్ట్రేలియా భారీ స్కోరు… మన బ్యాటర్లు ఏం చేస్తారో ?

ఊహించినట్టుగానే అహ్మదాబాద్ టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ఉస్మాన్ ఖవాజా డబుల్ సెంచరీ మిస్ అయినా , కామెరూన్ గ్రీన్ శతకంతో అదరగొట్టాడు.

  • Written By:
  • Publish Date - March 10, 2023 / 07:48 PM IST

4th Test Ind Vs Aus 2nd day: ఊహించినట్టుగానే అహ్మదాబాద్ టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ఉస్మాన్ ఖవాజా డబుల్ సెంచరీ మిస్ అయినా , కామెరూన్ గ్రీన్ శతకంతో అదరగొట్టాడు. వీరిద్దరి పార్టనర్ షిప్ తో పాటు…ఖవాజా లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిన పిచ్‌పై ఆసీస్‌ ఖవాజా , గ్రీన్ తొలి సెషన్ నుంచే ధాటిగా ఆడారు. ఓవర్‌నైట్‌ స్కోరు 255/4 తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌.. తొలి సెషన్‌లో ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. ఈ క్రమంలో గ్రీన్‌ కూడా టెస్టుల్లో తొలి సెంచరీని పూర్తి చేశాడు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు ఏకంగా 208 పరుగులను జోడించారు.

అయితే రెండో సెషన్ తర్వాత అశ్విన్‌ గ్రీన్‌తోపాటు క్యారీలను వెంట వెంటనే పెవిలియన్‌ కు పంపాడు. ఆ తర్వాత వచ్చిన స్టార్క్‌ కూడా అశ్విన్‌ బౌలింగ్ లోనే ఔటయ్యాడు. తొలి ఓవర్‌ నుంచి ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను నడిపించిన ఖవాజాను అక్షర్ పటేల్‌ ఔట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఆసీస్‌ను త్వరగా ఆలౌట్‌ చేద్దామని భావించిన భారత్‌కు టాడ్ మర్ఫీ , లయన్ షాక్ ఇచ్చారు. వీరిద్దరూ 9వ వికెట్‌కు 70 పరుగులను జోడించారు. వీరిద్దరినీ అశ్విన్ ఔట్ చేయడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ 480 రన్స్ దగ్గర ముగిసింది. భారత బౌలర్లలో అశ్విన్‌ 6, షమీ 2.. జడేజా, అక్షర్‌ చెరో వికెట్ తీశారు.

తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ , శుభ్‌మన్‌ గిల్ మంచి ఆరంభాన్నే ఇచ్చారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 17, శుభ్‌మన్‌ గిల్ 18 రన్స్ తో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 444 పరుగులు వెనుకబడి ఉంది. మూడో రోజు పూర్తిగా బ్యాటింగ్‌ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆసీస్‌ మాదిరిగా టీమ్‌ఇండియా బ్యాటర్లు రాణించాలి. బ్యాటింగ్ పిచ్ కావడంతో మూడోరోజు ఆట కీలకం కానుంది.