Asia Cup:ఆసియా కప్ షెడ్యూల్…భారత్ , పాక్ పోరు ఎప్పుడంటే ?

క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్‌ షెడ్యూల్‌ వచ్చేసింది. దుబాయ్‌, షార్జా వేదికలుగా ఈనెల 27 నుంచి మెగా టోర్నీ ప్రారంభంకానుంది.

  • Written By:
  • Publish Date - August 3, 2022 / 03:03 PM IST

క్రికెట్‌ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసియా కప్‌ షెడ్యూల్‌ వచ్చేసింది. దుబాయ్‌, షార్జా వేదికలుగా ఈనెల 27 నుంచి మెగా టోర్నీ ప్రారంభంకానుంది. దుబాయ్‌ వేదికగా శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ షురూ కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న దాయాదుల సమరం ఆగస్ట్‌ 28న జరుగనుంది. గ‌త ఏడాది జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇండియా, పాకిస్థాన్ చివ‌ర‌గా తలపడ్డాయి.
ఈ మ్యాచ్ లో ఇండియాపై పాకిస్థాన్ ప‌ది వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకునేందుకు రోహిత్ సేన సిద్ధ‌మ‌వుతోంది. ఇప్పటికే భారత్ , పాక్ మ్యాచ్ పై క్రికెట్ ల‌వ‌ర్స్‌లో ఆస‌క్తి నెల‌కొంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సీరీస్ లు ఎప్పటి నుంచో నిలిచిపోయాయి. దీంతో ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్ , పాక్ తలపడనున్నాయి. ఈ యేడాది ఆసియా కప్ తో పాటు టీ ట్వంటీ వరల్డ్ కప్ లోనూ దాయాది దేశాల క్రికెట్ సమరం ఫాన్స్ ను అలరించబోతోంది.ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌, శ్రీలంక‌, ఆఫ్ఘ‌నిస్తాన్ నేరుగా ఆసియా కప్ కు అర్హత సాధించాయి. యుఏఈ, కువైట్, హాంకాంగ్, సింగపూర్ టీమ్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్ లు ఆడనున్నాయి. ఇందులో నుండి రెండు టీమ్స్ ఆసియా కప్ కు అర్హత సాధిస్తాయి.

మొత్తం రెండు టీమ్స్ గా ఆయా జట్లను విభజించారు. టీ ట్వంటీ ఫార్మాట్ లో ఈ సారి ఆసియా కప్ జరగనుంది.
గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్థాన్ తో పాటు ఒక క్వాలిఫయర్ టీమ్ ఉండగా, గ్రూప్ బీలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ తో పాటు మరో క్వాలిఫయర్ టీమ్ ఉండనున్నాయి. ఈ మ్యాచ్‌ల‌కు దుబాయ్‌, షార్జా ఆతిథ్యం ఇవ్వ‌బోతున్నాయి. ఈ టోర్నమెంట్ ను శ్రీలంకలో నిర్వహించాలని భావించినా.. అక్కడి ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని యూఏఈకి మార్చారు.ఆగస్టు 27న మొదలయ్యే ఈ మెగా టోర్నీ సెప్టెంబరు 11న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.