IND vs ZIM: దంచికొట్టిన జైశ్వాల్, గిల్ జింబాబ్వేపై సిరీస్ కైవసం

నాలుగో టీ ట్వంటీలో యంగ్ ఇండియా 10 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య జట్టు 7 వికెట్లకు 152 పరుగులు చేసింది.

IND vs ZIM: జింబాబ్వే పర్యటనలో యువ భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయంతో టీ ట్వంటీ సిరీస్ ను కైవసం చేసుకుంది. హరారే వేదికగా జరిగిన నాలుగో టీ ట్వంటీలో యంగ్ ఇండియా 10 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆతిథ్య జట్టు 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. కెప్టెన్ సికిందర్ రాజా 46 పరుగులతో రాణించాడు. నిజానికి పవర్ ప్లేలో జింబాబ్వే జోరు చూస్తే భారీస్కోర్ చేసేలా కనిపించింది. తొలి వికెట్ కు ఓపెనర్లు 63 పరుగులు జోడించారు. అయితే స్పిన్నర్ల రాకతో పరిస్థితి మారిపోయింది. ఆతిథ్య జట్టు వరుస వికెట్లు కోల్పోయింది. సికిందర్ రాజా ధాటిగా ఆడకుంటే 150 రన్స్ దాటేది కాదు. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2, తుషార్ దేశ్ పాండే, శివమ్ దూబే, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఛేజింగ్ లో భారత ఓపెనర్లు జైశ్వాల్ , గిల్ జింబాబ్వే బౌలర్లను ఆటాడుకున్నారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. దీంతో పవర్ ప్లేలోనే భారత్ 61 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసినా కూడా జైశ్వాల్ ఆతిథ్య జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. స్టేడియం నలువైపులా షాట్లు కొడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. ఈ క్రమంలో కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరి జోరుకు భారత్ 10 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 106 పరుగులు చేసింది. తర్వాత కూడా అదే దూకుడు కొనసాగిస్తూ మ్యాచ్ ను ముగించింది. గిల్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో భారత్ 15.2 ఓవర్లలో టార్గెట్ ను ఛేదించింది. జైశ్వాల్ 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 93 , గిల్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. సిరీస్ లో తర్వాతి మ్యాచ్ ఆదివారమే జరుగుతుంది.

Also Read: MLA Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేసిన ఎమ్మెల్యే హ‌రీష్ రావు..!

Follow us