IND vs SL 1st T20I: శ్రీలంక టూర్ లో భారత్ క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమ ప్రస్థానాన్ని విజయంతో ఆరంభించారు. పల్లెకెలె వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీలో టీమిండియా 43 పరుగుల తేడాతో గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు శుభ్ మన్ గిల్, యశస్వి జైశ్వాల్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 6 ఓవర్లలో 74 పరుగులు జోడించారు. శ్రీలంకపై భారత్ కు పవర్ ప్లేలో ఇదే అత్యధిక స్కోర్. అయితే పవర్ ప్లే ముగిసిన వెంటనే వీరిద్దరూ ఔటవడంతో కాస్త జోరు తగ్గింది. ఈ దశలో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ చెలరేగిపోయాడు. తన సహజశైలి షాట్లతో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. స్టేడియం అన్నివైపులా షాట్లు కొడుతూ మిస్టర్ 360ని మరోసారి గుర్తు చేశాడు. సూర్యకుమార్ కేవలం 26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడినా తర్వాత పుంజుకున్నాడు. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగులు చేసింది. పంత్ 33 బంతుల్లో 49 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఛేజింగ్ లో అనూహ్యంగా లంక ఓపెనర్లు నిస్సాంక, కుశాల్ మెండిస్ రెచ్చిపోయారు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించడంతో ధాటిగా ఆడారు. పవర్ ప్లేలో వీరిద్దరూ ఎటాకింగ్ బ్యాటింగ్ ఆడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించారు. తొలి వికెట్ కు 8.4 ఓవర్లలోనే 84 పరుగులు జోడించారు. అయితే వీరి పార్టనర్ షిప్ ను అర్షదీప్ సింగ్ బ్రేక్ చేశాడు. కుశాల్ మెండిస్ 45 రన్స్ కు ఔటైనప్పటకీ నిస్సాంక తన జోరు కొనసాగించాడు. భారత ఫీల్డింగ్ లో పలు తప్పిదాలు కూడా లంక స్కోర్ వేగానికి కారణమయ్యాయి. నిస్సాంక 48 బంతుల్లో 79 పరుగులు చేసి ఔటయ్యాక లంక వేగంగా వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ , రియాన్ పరాగ్, రవి బిష్ణోయ్ కీలక సమయంలో వికెట్లు తీయడంతో భారత్ మ్యాచ్ పై పట్టుబిగించింది. చివరికి శ్రీలంక 170 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ 3 వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ 2, అర్షదీప్ సింగ్ 2, రవి బిష్ణోయ్ 1, సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో మూడు టీ ట్వంటీల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.