India T20 World Cup Squad: బూమ్రా,హర్షల్‌ పటేల్ రీఎంట్రీ.. టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు భారత జట్టు ఇదే

టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ కోసం భారత జట్టును ప్రకటించారు. ఊహించినట్టుగానే స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా, హర్షల్ పటేల్ జట్టులోకి తిరిగి వచ్చారు.

  • Written By:
  • Updated On - September 12, 2022 / 06:02 PM IST

టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ కోసం భారత జట్టును ప్రకటించారు. ఊహించినట్టుగానే స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా, హర్షల్ పటేల్ జట్టులోకి తిరిగి వచ్చారు. ఇటీవల ఆసియాకప్‌లో వైఫల్యం నేపథ్యంలో జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ముందు నుంచీ కెప్టెన్ రోహిత్‌శర్మ చెబుతున్నట్టు దాదాపు 90 శాతం ఊహించిన ఆటగాళ్ళే ఎంపికయ్యారు. కెప్టెన్‌గా రోహిత్‌శర్మ, వైస్‌ కెప్టెన్‌గా కెఎల్ రాహుల్ వ్యవహరించనుండగా.. కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు.

ఐపీఎల్‌లో నిలకడగా రాణించిన సూర్యకుమార్ , హుడాలు కీలకం కానున్నారు. అలాగే అందరిలోనూ ఆసక్తి రేకెత్తించిన వికెట్ కీపింగ్ విషయంలో సెలక్టర్లు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఇద్దరిని ఎంపిక చేశారు. రిషబ్ పంత్‌తో పాటు దినేశ్ కార్తీక్‌నూ సెలక్ట్ చేశారు. ఐపీఎల్‌ 15వ సీజన్‌లో దినేశ్ కార్తీక్ అద్భుతంగా రాణించాడు. ఇక జాతీయ జట్టులో రీఎంట్రీ కష్టమనుకున్న దశలో ఫినిషర్ రోల్‌లో అదరగొట్టాడు. దీంతో అప్పటి నుంచీ వరుస సిరీస్‌లకు ఎంపికవుతూ వచ్చిన డీకేను టీ ట్వంటీ ప్రపంచకప్‌కూ సెలక్టర్లు తీసుకున్నారు. దినేశ్ కార్తీక్‌ ఫినిషర్ రోల్‌ పోషించనున్నాడు. ఇక ఆల్‌రౌండర్ కోటాలో హార్థిక్ పాండ్యా ఎంపికయ్యాడు. రవీంద్ర జడేజా గాయంతో దూరమవడంతో స్పిన్ విభాగంలో సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్‌ ఎంపికయ్యారు.

వీరిలో అశ్విన్, అక్షర్ పటేల్ మధ్య పోటీ నెలకొనే అవకాశముంది. ఇక పేస్ విభాగంలో ఊహించినట్టుగానే బూమ్రా, హర్షల్ పటేల్ ఫిట్‌నెస్ సాధించడంతో జట్టులోకి తిరిగి వచ్చారు. వీరిద్దరితో పాటు భువనేశ్వర్‌ కుమార్, అర్షదీప్‌సింగ్‌ చోటు దక్కించుకున్నారు. ఐపీఎల్‌లో నిలకడగా రాణించిన అర్షదీప్‌సింగ్ ఇటీవల ఆసియాకప్‌లోనూ పర్వాలేదనిపించాడు. అయితే ఆస్ట్రేలియా పిచ్‌లు అతని బౌలింగ్‌కు సరిపోతాయన్న ఉద్ధేశంతో ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇక స్టాండ్ బై ప్లేయర్స్‌గా మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్ చోటు దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ ట్వంటీ వరల్డ్‌కప్ అక్టోబర్ 16 నుంచి మొదలు కానుంది. భారత్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో అక్టోబర్ 23న తలపడబోతోంది. ఈ టోర్నీ కంటే ముందు టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లతో సిరీస్‌లు ఆడనుంది.

వరల్డ్‌కప్‌కు భారత జట్టు ః
రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్ (వైస్ కెప్టెన్) , కోహ్లి, సూర్యకుమార్, దీపక్ హుడా , రిషబ్ పంత్‌, దినేష్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా ,అశ్విన్‌, యుజ్వేందర్‌ చాహల్‌, అక్షర్‌ పటేల్‌, బుమ్రా, భువనేశ్వర్‌, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్‌

స్టాండ్‌బై ప్లేయర్స్‌ : షమీ, శ్రేయస్‌ అయ్యర్, దీపక్‌ చాహర్‌ , రవి బిష్ణోయ్