India Beat SA: గెలిచి నిలిచారు.. విశాఖ టీ ట్వంటీలో భారత్‌ విజయం

సిరీస్‌ చేజారకుండా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా దుమ్మురేపింది.

  • Written By:
  • Publish Date - June 14, 2022 / 10:54 PM IST

సిరీస్‌ చేజారకుండా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా దుమ్మురేపింది. విశాఖ వేదికగా జరిగిన మూడో టీ ట్వంటీలో సౌతాఫ్రికాను ఓడించింది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు, బౌలింగ్‌లో హర్షల్ పటేల్, చాహల్ మెరిసారు.

సొంతగడ్డపై వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన భారత్ ఎట్టకేలకు సౌతాఫ్రికా జోరుకు బ్రేక్ వేసింది. మూడో మ్యాచ్‌లోనూ టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు10 ఓవర్లలోనే 97 పరుగులు జోడించారు. గత రెండు మ్యాచ్‌లలోనూ నిరాశపరిచిన రుతురాజ్ గైక్వాడ్ ఈ సారి మాత్రం చెలరేగిపోయాడు. సఫారీ బౌలర్లపై ఎటాకింగ్ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. అటు ఇషాన్ కిషన్ కూడా మెరుపులు మెరిపించాడు. రుతురాజ్ 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 రన్స్ చేయగా… ఇషాన్ కిషన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. అయితే ఓపెనర్లు ఔటైన తర్వాత భారత్ స్కోరు వేగానికి బ్రేక్ పడింది. శ్రేయాస్ అయ్యర్ 14, పంత్ 6 , దినేశ్ కార్తీక్ 6 పరుగులకే ఔటయ్యారు. చివర్లో హార్థిక్ పాండ్యా ధాటిగా ఆడాడు. పాండ్యా 21 బంతుల్లో 4 ఫోర్లతో 31 రన్స్ చేశాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఓపెనర్లు జోరుతో 10 ఓవర్లకు 97 పరుగులు చేసిన టీమిండియా తర్వాత బ్యాటర్లు విఫలమవడంతో చివరి 10 ఓవర్లలో 82 పరుగులే చేయగలిగింది. సఫారీ బౌలర్లలో ప్రిటోరియస్ 2 , షంశి, మహారాజ్, రబాడా ఒక్కో వికెట్ పడగొట్టారు.

బ్యాటింగ్ పిచ్ కావడంతో 180 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా ఛేదించేద్దాం అనుకున్న సౌతాఫ్రికాను ఆరంభం నుంచే భారత బౌలర్లు దెబ్బకొట్టారు. పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు పడగొట్టి ఒత్తిడి పెంచారు. కెప్టెన్ బవుమా 8, హెండ్రిక్స్ 23 స ప్రిటోరియస్ 20, డస్సెన్ 1 పరుగుకే ఔటయ్యారు. రెండో టీ ట్వంటీలో అదరగొట్టిన క్లాసెన్ కాసేపు ధాటిగా ఆడినా భారీస్కోర్ సాధించలేకపోయాడు. క్లాసెన్‌ను 29 రన్స్‌కే చాహల్ ఔట్ చేయగా.. మిల్లర్‌ను 3 రన్స్‌కే హర్షల్ పటేల్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో సౌతాఫ్రికా 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. తర్వాత బ్యాటర్లలో పార్నెల్ తప్పిస్తే మిగిలిన వారంతా త్వరగానే ఔటవడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కు 131 పరుగుల దగ్గర తెరపడింది. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 3.1 ఓవర్లలో 25 పరుగులకు 4 వికెట్లు తీయగా.. చాహల్ 4 ఓవర్లలో 20 రన్స్ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో సిరీస్ ఆశలను భారత్ సజీవంగా ఉంచుకుంది. సిరీస్‌లో నాలుగో టీ ట్వంటీ శుక్రవారం రాజ్‌కోట్‌లో జరుగుతుంది.

Photo Courtesy: BCCI/Twitter